పెళ్లి కుమార్తె ట్వీట్‌కు రాష్ట్రపతి స్పందన

ఉన్నత స్థాయి సమావేశం అంటే భద్రత పరంగా ఎంతో హడావిడి ఉంటుంది. ఇక రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రుల సమావేశం అంటే చెప్పక్కర్లేదు. వారు ఎక్కడ సమావేశం నిర్వహించాలనుకున్న ఆ ప్రాంతం

Updated : 06 Jan 2020 20:46 IST

కొచ్చి: ఉన్నత స్థాయి సమావేశం అంటే భద్రత పరంగా ఎంతో హడావిడి ఉంటుంది. ఇక రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రుల సమావేశం అంటే చెప్పక్కర్లేదు. వారు ఎక్కడ సమావేశం నిర్వహించాలనుకున్న ఆ ప్రాంతం మొత్తాన్ని భద్రాతాధికారులు కొద్ది రోజుల ముందే తమ ఆధీనంలోకి తీసుకొని క్షుణ్ణంగా తనీఖీలు నిర్వహించి, ఆ ప్రాంతంలో సామాన్యుల రాకపోకలపై ఆంక్షలు విధిస్తారు. ఇక హోటళ్లులాంటి చోట్లయితే భద్రతా సమస్యలు పేరుతో సాధారణ కార్యక్రమాలన్నీ రద్దు చేస్తారు. తాజాగా ఓ హోటల్లో తమ వివాహాన్ని ఏర్పాటు చేసుకున్న జంటకు అటువంటి అనుభవమే ఎదురైంది. వివరాల్లోకి వెళితే... అమెరికాలోని మిషిగన్‌ రాష్ట్రానికి చెందిన యాష్లే హాల్ అనే యువతి వివాహం కేరళలోని కొచ్చికి చెందిన అభి అనే వ్యక్తితో ఈ నెల 7న తాజ్‌ హోటల్‌లో జరగనుంది. సరిగ్గా అదే రోజున రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు తాజ్‌ హోటల్‌లో విడిది ఏర్పాటు చేశారు.

భద్రతా కారణాల దృష్ట్యా, వారి వివాహాన్ని మరో చోటికి మార్చుకోవాలని అధికారులు పెళ్లి వారికి సూచించారు. దీంతో వధువు యాష్లే హాల్ తన అసహనాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేసింది. దాంతో పాటు భద్రతా అధికారులతో మాట్లాడి తమ వివాహాం అదే హోటల్‌లో సజావుగా జరిగేందుకు సహాయం చేయాలని రాష్ట్రపతిభవన్‌ వర్గాలను కోరుతూ ట్వీట్‌ చేసింది. దీనిపై స్పందించిన రాష్ట్రపతి కార్యాలయం వర్గాలు వివాహానికి ఎటువంటి ఆటంకం ఉండదని, మీ వివాహానికి రాష్ట్రపతి కోవింద్ అభినందనలు తెలియజేశారని ట్వీట్ చేశారు. అనంతరం రాష్ట్రపతి ఆదేశాల మేరకు భద్రతా నిబంధనలు సడలించినట్లు స్థానిక మీడియా తెలిపింది. దీనిపై వధువు యాష్లీ  స్పందిస్తూ గౌరవ రాష్ట్రపతి ఆశీర్వాదంతో మా వివాహం ఎటువంటి ఆటంకం లేకుండా జరగబోతోందంటూ స్థానిక అధికారులకు, హోటల్ యాజమాన్యానికి ట్విటర్‌ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు అతిథి దేవోభవకు నిజమైన అర్థం, మీ నుంచి ఎంతో నేర్చుకోవాలి, వీవీఐపీ సంస్కృతికిది ముగింపు అంటూ రాష్ట్రపతిని ఉద్దేశించి కామెంట్లు పెడుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని