కరోనా ఎఫెక్ట్‌: భారత్‌ 24X7 హెల్ప్‌లైన్‌

దిల్లీ: చైనాలో మొదలై ప్రపంచాన్ని వణికిస్తోంది కరోనా వైరస్‌. అన్ని దేశాలకు విస్తరిస్తూ ప్రజలను భయపెడుతోంది. చైనా నుంచి భారత్‌కు వచ్చిన పలువురు ప్రయాణికులకు కరోనా వైరస్‌ అనుమానంతో హాస్పిటల్స్‌లో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్‌ లక్షణాల గురించి త

Published : 28 Jan 2020 17:08 IST

దిల్లీ: చైనాలో మొదలై ప్రపంచాన్ని వణికిస్తోంది కరోనా వైరస్‌. అన్ని దేశాలకూ విస్తరిస్తూ ప్రజలను భయపెడుతోంది. చైనా నుంచి భారత్‌కు వచ్చిన పలువురు ప్రయాణికులకు కరోనా వైరస్‌ అనుమానంతో హాస్పిటల్స్‌లో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్‌ లక్షణాల గురించి తెలుసుకునేందుకు భారత ప్రభుత్వం 24X7 హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. ఈ వైరస్‌కు సంబంధించి ఎటువంటి అనుమానాలున్నా 011-23978046  నెంబరుకు ఫోన్‌ చేసి నివృత్తి చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. చెకప్‌ కోసం దగ్గర్లో ఉన్న ఆసుపత్రి వివరాలను కూడా ఈ నెంబరుకు ఫోన్‌ చేసి తెలుసుకోవచ్చు. 

కరోనా వైరస్‌కు సంబంధించి సందేహాలను నివృత్తి చేసుకునేందుకు 24X7 హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ట్వీట్‌ చేసింది. జనవరి 1, 2020 నుంచి చైనా వెళ్లి వచ్చిన ప్రయాణికులకు కరోనా వైరస్‌ లక్షణాలు ఏమైనా కనిపిస్తే వాళ్లు స్వచ్ఛందంగా తమ వివరాలను ఈ హెల్ప్‌లైన్‌ కాల్‌సెంటర్‌కు ఫోన్‌ చేసి తెలపాల్సిందిగా కేంద్రం కోరింది. దగ్గు, జ్వరంతో బాధపడుతుంటే వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాల్సిందిగా సూచించింది. కరోనా వైరస్‌ కొన్ని కేసుల్లో వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయని వైద్య నిపుణులు తెలిపారు. భారత్‌లో కరోనా వైరస్‌ కేసులేవీ నమోదు కాలేదని భయపడాల్సిన పనేమి లేదని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డా.హర్షవర్ధన్‌ తెలిపారు. వైరస్‌ వ్యాప్తి కాకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. అన్ని ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేయడంతో పాటు హెల్ప్‌లైన్‌ నెంబరును ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. 

చైనాలో ఈ వైరస్‌ కారణంగా ఇప్పటి వరకు 106 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే ఇది అమెరికా, జర్మనీ, శ్రీలంక, కెనడా సహా చాలా దేశాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. దేశ రాజధాని దిల్లీలోను కరోనా లక్షణాలతో ముగ్గురు వ్యక్తులు రామ్‌ మనోహర్‌ లోహియా ఆస్పత్రిలో చేరారు. వారి నమూనాలను పరీక్షలకు పంపించారు. హైదరాబాద్‌, పట్నాలోను కరోనా వైరస్‌ అనుమానితులు ఆసుపత్రుల్లో చేరిన విషయం తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని