ఈజిప్టు మాజీ అధ్యక్షుడు ముబారక్‌ కన్నుమూత

ఈజిప్టు మాజీ అధ్యక్షుడు హోస్నీ ముబారక్‌ కన్నుమూశారు. ఆయన వయసు 91 ఏళ్లు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారని అధికారవర్గాలు వెల్లడించాయి. ఇటీవలే ఆయన ఓ శస్త్రచికిత్స చేయించుకున్నారని తెలిపాయి. ముబారక్‌ 1981 నుంచి 2011 వరకు ఈజిప్టు అధ్యక్షుడిగా ఉన్నారు.

Published : 26 Feb 2020 01:24 IST

30 ఏళ్లపాటు దేశాన్ని శాసించిన నేత

కైరో: ఈజిప్టు మాజీ అధ్యక్షుడు హోస్నీ ముబారక్‌ కన్నుమూశారు. ఆయన వయసు 91 ఏళ్లు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారని అధికారవర్గాలు వెల్లడించాయి. ఇటీవలే ఆయన ఓ శస్త్రచికిత్స చేయించుకున్నారని తెలిపాయి. ముబారక్‌ 1981 నుంచి 2011 వరకు ఈజిప్టు అధ్యక్షుడిగా ఉన్నారు. మూడు దశాబ్దాలపాటు దేశాన్ని తన కనుసైగలతో శాసించారు. అమెరికాకు మంచి మిత్రుడు. ఇస్లామిక్‌ తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపారు. ముబారక్‌ నియంతృత్వ ధోరణిని అనుసరిస్తున్నారంటూ 2011లో దేశవ్యాప్తంగా ప్రజలు ఆందోళనలు చేపట్టారు. 18 రోజులపాటు నిరసనలు తీవ్రస్థాయిలో కొనసాగాయి. వాటిలో చెలరేగిన ఘర్షణల్లో దాదాపు 900 మంది నిరసనకారులు మృత్యువాతపడ్డారు. దీంతో 2011 ఫిబ్రవరి 11న సైన్యం ఆయన్ను పదవీచ్యుతుణ్ని చేసి అధికారాలను తన చేతుల్లోకి తీసుకుంది. ఆ పరిణామం అరబ్‌ ప్రపంచంలో అత్యంత సంచలనంగా మారింది. 18 రోజులపాటు సాగిన ఆందోళనల్లో నిరసనకారుల మరణాలను నివారించలేకపోయారంటూ 2012 జూన్‌లో ఓ కోర్టు ముబారక్‌కు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 2014లో ఉన్నత న్యాయస్థానం ఆ తీర్పును కొట్టివేసింది. అనంతరం అవినీతి అభియోగాలపై ముబారక్‌తోపాటు ఆయన ఇద్దరు కుమారులకు మూడేళ్ల జైలు శిక్ష పడింది. 2017లో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని