గూగుల్‌ ఉద్యోగికి కరోనా.. అమెజాన్‌ అప్రమత్తం

స్విట్జర్లాండ్‌లోని జ్యురిచ్‌లో ఓ గూగుల్‌ ఉద్యోగి కరోనా బారిన పడ్డారు. తాజాగా పరీక్షలు నిర్వహించగా ఆ ఉద్యోగికి పాజిటివ్‌గా తేలినట్లు అధికారులు శనివారం తెలిపారు.

Published : 01 Mar 2020 00:53 IST

జెనీవా: స్విట్జర్లాండ్‌లోని జ్యురిచ్‌లో ఓ గూగుల్‌ ఉద్యోగి కరోనా బారిన పడ్డారు. తాజాగా పరీక్షలు నిర్వహించగా ఆ ఉద్యోగికి పాజిటివ్‌గా తేలినట్లు అధికారులు శనివారం తెలిపారు. దీంతో సంస్థ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. ఉద్యోగులను ఇరాన్‌, చైనా పర్యటనలకు వెళ్లకుండా నిషేధం విధించింది. అంతేకాకుండా ఏప్రిల్‌లో జరగనున్న గ్లోబల్ న్యూస్‌ ఇనిషియేటివ్‌ సదస్సును గూగుల్‌ రద్దు వేసుకుంది. మరోవైపు అమెజాన్‌ సైతం అప్రమత్తమైంది. ఉద్యోగుల అనవసర ప్రయాణాలపై పరిమితులు విధించినట్లు ఆ సంస్థ ప్రతినిధి తెలిపారు.

చైనాలో తయారీ పరిశ్రమలపై దెబ్బ:
కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా చైనాలో తయారీ పరిశ్రమలు భారీగా దెబ్బతింటున్నాయి. ఈ ఫిబ్రవరిలో చైనాలోని తయారీ పరిశ్రమల కార్యకలాపాలు ఎన్నడూ లేనంతగా కుదించాయి. చైనా పర్చేజింగ్‌ మేనేజర్‌ ఇండెక్స్‌ బాగా కనిష్ఠానికి పడిపోయిందని శనివారం జాతీయ గణాంకాల సంస్థ ప్రకటించింది. చైనా పీఎంఐ 35.7 నమోదైనట్లు వెల్లడించింది. ఈ పరిస్థితి అంతర్జాతీయ ఆర్థిక సంక్షభం సమయం కన్నా దారుణమని విశ్లేషకులు భావిస్తున్నారు. 

గల్ఫ్‌ పౌరులకు సూచనలు:
గల్ఫ్‌ దేశాలైన కువైట్‌, సౌదీ అరేబియా తమ పౌరులకు ఇతర దేశాల పర్యటనలను మానుకోవాలని సూచించాయి. కువైట్‌లో మొత్తం 45 మందికి వైరస్‌ సోకిన నేపథ్యంలో పర్యటనలపై నిషేధం విధించింది. లెబనాన్‌లో వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో సౌదీ తమ పౌరులను అక్కడికి వెళ్లవద్దని ఆదేశించింది. 

దక్షిణకొరియాలో 3వేలకు చేరిన కేసులు:
చైనా తర్వాత అత్యధికంగా కరోనా కేసులు దక్షిణ కొరియాలోనే నమోదవుతున్నాయి. తాజాగా 219 కొత్త కేసులు నమోదు కావడంతో అక్కడ మొత్తం బాధితుల సంఖ్య 3,150కి చేరినట్లు అక్కడి అధికారులు తెలిపారు. 

ఇరాన్‌లో మరింత పెరిగిన మృతుల సంఖ్య:
ఇరాన్‌లో వైరస్‌ కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఆ దేశ ఆరోగ్య శాఖ ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం.. మరణించిన వారి సంఖ్య 43కు చేరింది. 593 మందికి వైరస్‌ బారిన పడినట్లు తెలిపారు. దీంతో ప్రభుత్వం బహిరంగ సమావేశాలను నిషేధించింది. కరోనా కారణంగా చైనా తర్వాత అత్యధికంగా మరణాలు సంభవించిన వారిలో ఇరాన్‌ రెండో స్థానంలో ఉండటం గమనార్హం. 

పర్యవేక్షణలో ఇటలీ ఫుట్‌బాల్ టీమ్‌:
ఇటలీకి చెందిన సిరీ-సీ ఫుట్‌బాల్‌ టీమ్‌ ఆటగాళ్లలో ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆటగాళ్లందరినీ పర్యవేక్షణ కేంద్రానికి తరలించారు. ఛాంపియన్‌షిప్‌ గేమ్‌లో భాగంగా వారు అలెగ్జాండ్రియాలో ఉండగా ఒకరికి జ్వరం, తలనొప్పి లక్షణాలు కనిపించాయని టుస్కానీ పియానీస్‌ క్లబ్‌ తెలిపింది. 

యూఎస్‌నూ వెంటాడుతున్నాయి:
కరోనా వైరస్‌ వ్యాప్తి భయాలు యూఎస్‌నూ వెంటాడుతున్నాయి. వచ్చేనెలలో లాస్‌ వెగాస్‌లో జరగనున్న ఏసియన్‌ సమ్మిట్‌(అసోసియేషన్‌ ఆఫ్‌ సౌత్‌ఈస్ట్‌ నేషన్స్‌) సమావేశాలను యూఎస్‌ వాయిదా వేస్తున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. ‘కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు అంతర్జాతీయ సమాజం పనిచేస్తోంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఏసియన్‌ సమావేశం నిర్వహణ కొద్ది రోజులు వాయిదా వేయడానికి నిర్ణయం తీసుకున్నాం. ఈ విషయమై భాగస్వాములతోనూ మాట్లాడాం’ అని తెలిపారు. ఏసియన్‌(అసోసియేషన్‌ ఆఫ్‌ సౌత్‌ఈస్ట్‌ నేషన్స్‌) నాయకుల సదస్సు మార్చి 14న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆధ్వర్యంలో జరగాల్సి ఉంది.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని