కరోనా అప్‌డేట్స్‌: వుహాన్‌లో వైద్యుల ఆనందం

ఇరాన్‌లో కరోనా వైరస్‌ విజృంభణ భారీగా కొనసాగుతోంది. తాజాగా ఆదివారం ఈ మహమ్మారి కారణంగా ఇరాన్‌లో కొత్తగా 113 మంది మరణించడం గమనార్హం. వీరితో మొత్తం మరణించిన వారి సంఖ్య 724కు చేరింది. ఈ సందర్భంగా ఇరాన్ ఆరోగ్య శాఖ ప్రతి

Updated : 15 Mar 2020 19:32 IST

టెహ్రాన్‌: ఇరాన్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. తాజాగా ఆదివారం ఈ మహమ్మారి కారణంగా ఇరాన్‌లో కొత్తగా 113 మంది మరణించడం గమనార్హం. దీంతో మొత్తం మరణించిన వారి సంఖ్య 724కు చేరింది. ఈ సందర్భంగా ఇరాన్ ఆరోగ్య శాఖ ప్రతినిధి కియానౌష్ జహాన్‌పౌర్ మాట్లాడుతూ.. ప్రజలు అన్ని పర్యటనలు రద్దు చేసుకోవాలని సూచించారు. ఇళ్ల వద్దే ఉండాలని కోరారు. పరిస్థితులు మెరుగయ్యాక పర్యటనలు పెట్టుకోవాలని సూచించారు. 

ఇరాన్, ఇటలీ నుంచి భారతీయులు వెనక్కి

కరోనా ప్రభావిత ఇరాన్, ఇటలీ దేశాల్లో ఉన్న భారతీయుల్ని ప్రభుత్వం ఆదివారం వెనక్కి రప్పించింది. రెండు దేశాల నుంచి దాదాపు 450 మందిని రెండు ప్రత్యేక విమానాల్లో భారత్‌కు రప్పించారు. ఇటలీలోని మిలన్‌ నుంచి ఇందిరాగాంధీ విమానాశ్రయానికి 218 మంది భారతీయులు వెనక్కి రాగా.. ఇరాన్‌ నుంచి వచ్చిన మరో విమానంలో 230 మంది వెనక్కి వచ్చారు. ఇటలీ నుంచి చేరుకున్న వారందరినీ సౌత్‌వెస్ట్‌ దిల్లీలోని ఐటీబీపీ క్వారంటైన్‌కు తరలించారు. ఇరాన్‌ నుంచి వచ్చిన వారిని రాజస్థాన్‌లోని జైసల్మేర్‌ ఆర్మీ వెల్‌నెస్‌ కేంద్రానికి తరలించారు. ఇటలీలో కరోనా కారణంగా 1,400 మంది మరణించగా.. 21వేల మంది వైరస్‌ బారిన పడ్డారు. 

వుహాన్‌లో వైద్యుల ఆనందోత్సాహాలు

కరోనా వైరస్‌ చైనాలో తగ్గముఖం పట్టి, ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు వ్యాప్తిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, అసలు కరోనా మొదలైన వుహాన్‌లో ప్రస్తుత పరిస్థితి దాదాపు అదుపులోకి వచ్చింది. అక్కడ తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఆస్పత్రిని మూసివేయడంతో  వైద్యులు తమ ముఖానికి ఉన్న మాస్క్‌లు తీసేసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. 

 

అల్‌ అక్సా మసీదు మూత
ఇజ్రాయెల్‌ రాజధాని జెరూసలేంలోని ముస్లింల మూడో పవిత్ర క్షేత్రం అల్ అక్సా మసీదును మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కరోనా కారణంగా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముస్లిం వక్ఫ్‌ డిపార్ట్‌మెంట్‌ సభ్యులు వెల్లడించారు. 

భారత్‌లో పలు రాష్ట్రాల్లో విద్యాసంస్థలు మూసివేత
తమిళనాడు ప్రభుత్వం ఆదివారం కరోనా నివారణ చర్యలను ప్రారంభించింది. మార్చి 31 వరకు అన్ని ప్రైమరీ పాఠశాలలు మూసివేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తమిళనాడు సీఎం కె.పళనిస్వామి ఆదేశాలు జారీ చేశారు. కర్ణాటక, కేరళ సరిహద్దుల్లోని 16 జిల్లాల్లో థియేటర్లు, షాపింగ్‌ మాల్స్‌ మూసివేయాలని ఆదేశించారు. అదేవిధంగా విమానాశ్రయాల నుంచి వచ్చే ప్రయాణికులను అనుమానం ఉంటే ఐసోలేషన్‌కు పంపాలని సూచించారు. అవసరమైతే ప్రయాణికులను 14 రోజుల పాటు క్వారెంటైన్‌లో ఉంచేందుకు సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఆరోగ్య శాఖను ఆదేశించారు. 

గుజరాత్‌లోనూ అన్ని విద్యా సంస్థలను మార్చి 16 నుంచి 29 వరకు మూసేయాలని ప్రభుత్వం ఆదేశించింది. విద్యాసంస్థలు, థియేటర్లు మూసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు గుజరాత్‌ ముఖ్య కార్యదర్శి అనిల్‌ ముకిమ్‌ తెలిపారు. పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలోనూ కరోనా నివారణ చర్యలను ఆదివారం ముమ్మరం చేశారు. కేజీ, ప్రైమరీ విద్యాలయాలను మూసివేస్తూ ప్రభుత్వం ఆదివారం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పుదుచ్చేరి విద్యాశాఖ మంత్రి ఆర్‌ కమల్‌ కణ్ణన్‌ మీడియా సమావేశంలో తెలిపారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు పాఠశాలలు తెరవద్దు అని ఆదేశించారు. 

పాక్‌లో తాజాగా 34 కేసులు 

పాకిస్థాన్‌లోనూ కరోనా వైరస్‌ కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. తాజాగా ఆదివారం ఇస్లామాబాద్‌లో ఓ వ్యక్తికి కరోనా సోకడం గమనార్హం. ఇప్పటివరకు పాకిస్థాన్‌లో మొత్తం 34 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఆ దేశానికి చెందిన ఓ టీవీ ఛానెల్‌ వెల్లడించింది. 

కరోనా ఆ దేశాలకు దేవుడి శిక్ష

ప్రపంచ దేశాలపై కరోనా ప్రభావం కొనసాగుతున్న వేళ జింబాబ్వే రక్షణ శాఖ మంత్రి ఒప్పా ముచింగురి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమపై ఆంక్షలు విధించిన దేశాలకు ఈ వైరస్‌ దేవుడు విధించిన శిక్షగా పేర్కొన్నారు. శనివారం ఓ సమావేశంలో మాట్లాడిన ఆమె.. ‘మాపై ఆంక్షలు విధించిన దేశాలకు కరోనా దేవుడు విధించిన శిక్ష. ప్రస్తుతం ఆయా దేశాల ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. వారు మమ్మల్ని ఏ విధంగా అయితే చేశారో.. వారి ఆర్థిక వ్యవస్థలు సైతం కరోనా కారణంగా క్రమంగా పతనమవుతున్నాయి. దేవుడిలా భావిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఈ వైరస్‌ గుణపాఠం చెబుతుంది. కరోనా వైరస్‌ ప్రభావంతో వారు మా బాధను అర్థం చేసుకుంటారు’అని పేర్కొన్నారు. 

ఇదీ చదవండి..
భారత్‌లో కరోనా ఎఫెక్ట్‌: మహారాష్ట్రలో మరో 12 కరోనా కేసులు 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని