వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకే కర్ఫ్యూ: కేంద్రం

కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ప్రధాని మోదీ జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చారని, దీని వల్ల వైరస్‌ వ్యాప్తి గొలుసుకు అడ్డుకట్ట పడుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ.....

Updated : 20 Mar 2020 17:38 IST

దిల్లీ: కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ప్రధాని మోదీ జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చారని, దీని వల్ల వైరస్‌ వ్యాప్తి గొలుసుకు అడ్డుకట్ట పడుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. జనతా కర్ఫ్యూకు ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేసింది. కరోనాకు సంబంధించిన ఎలాంటి అనుమానాలున్నా 1075 నంబర్‌ను సంప్రదించాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ మీడియాతో మాట్లాడారు. 160 దేశాలకు ఈ వైరస్‌ విస్తరించిందని చెప్పారు. దేశంలో ఇప్పటి వరకు 206 మందికి ఈ వైరస్‌ సోకిందని, నలుగురు మరణించారని తెలిపారు. చనిపోయిన నలుగురూ 64 ఏళ్లకు పైబడిన వారేనని గుర్తుచేశారు.

ఇటలీ నుంచి జైపూర్‌కు వచ్చిన వ్యక్తిలో కరోనా పాజిటివ్‌ అని తేలినప్పటికీ.. తర్వాత అతడు కోలుకున్నాడని లవ్‌ అగర్వాల్‌ వివరించారు. పరీక్షల్లో నెగిటివ్‌ అని తేలిందన్నారు. ఆ తర్వాత అతడు గుండెపోటుతో మరణించాడని, అది కరోనా మృతుల కిందకు రాదని తెలిపారు. కరోనాపై పోరాడేందుకు కేంద్ర బృందాలను రాష్ట్రాలకు పంపించామని వివరించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో జనసమ్మర్థం తగ్గించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ బీ, సీ కేటగిరి ఉద్యోగులు వారం విడిచి వారం విధులకు హాజరుకావాలని చెప్పామన్నారు. అత్యవసరం అయితేనే ప్రయాణాలు చేయాలని, రైళ్లు, బస్సుల్లో ప్రయాణికులు దూరం దూరం కూర్చోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ విపత్తును అధిగమించేదుకు ప్రజలు సహకరించాలని కోరారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ముందస్తు నివారణ చర్యలే ముఖ్యం. సామాజిక దూరం అలవాటు చేసేందుకే జనతా కర్ఫ్యూ విధిస్తున్నామని, ఆదివారం ప్రజలందరూ జనతా కర్ఫ్యూలో పాల్గొనాలని లవ్‌ అగర్వాల్‌ సూచించారు.

ఇదీ చదవండి..
కరోనాకు బలహీనులం కావొద్దు.. కర్ఫ్యూ ధ్యేయమిదే


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని