కరోనా: పొరపాటు అంగీకరించిన WHO

భారతదేశంలో సమూహవ్యాప్తి లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) స్పష్టం చేసింది. గురువారం విడుదల చేసిన ‘పరిస్థితి నివేదిక’లో వైరస్‌ సమూహవ్యాప్తి దశలో ఉందని రాయడం పొరపాటేనని అంగీకరించింది. భారత్‌లో ఆయా ప్రాంతాల్లో కొన్ని కేసులు మాత్రమే ఉన్నాయని వివరించింది....

Published : 10 Apr 2020 16:40 IST

భారత్‌లో సమూహ వ్యాప్తి లేదని వివరణ

ముంబయి: భారతదేశంలో సమూహవ్యాప్తి లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) స్పష్టం చేసింది. గురువారం విడుదల చేసిన ‘పరిస్థితి నివేదిక’లో వైరస్‌ సమూహవ్యాప్తి దశలో ఉందని రాయడం పొరపాటేనని అంగీకరించింది. భారత్‌లో ఆయా ప్రాంతాల్లో కొన్ని కేసులు మాత్రమే ఉన్నాయని వివరించింది.

శుక్రవారం మధ్యాహ్నానికి భారత్‌లో 6,412 కొవిడ్‌-19 కేసులు నమోదయ్యాయి. 199 మంది మృతిచెందారు. చివరి 24 గంటల్లో 33 మంది మరణించారు. దేశంలో కొవిడ్‌-19 మూడో దశలో లేదని ఇంతకు ముందే నొక్కిచెప్పింది. ఎవరి నుంచి వైరస్‌ సోకిందో తెలియని స్థితిలో ఉన్నప్పుడే సమూహ వ్యాప్తిగా పేర్కొంటారు.

కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ శుక్రవారం ఉదయం నిర్వహించిన సమావేశంలోనూ దేశంలో సమూహ వ్యాప్తి లేదని స్పష్టం చేశారు. 600కు 400 జిల్లాల్లో అసలు వైరస్‌ ఉనికే లేదన్నారు. కేవలం 133 జిల్లాలే కరోనా ప్రజ్వలన కేంద్రాలుగా ఉన్నాయని వెల్లడించారు. వైరస్‌ సమూహ వ్యాప్తికి చేరుకుంటే ఆ విషయం దాచబోమని, ప్రజలకు వెల్లడిస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ గతంలో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాల్లో వైరస్‌ వ్యాప్తిని.. ధ్రువీకరించిన కేసులు లేకపోవడం, చాలా తక్కువ కేసులు, కొన్ని కేసులు, సమూహ వ్యాప్తిగా విభజించింది. గురువారం భారత స్థితిని సమూహ వ్యాప్తిగా నమోదు చేసిన డబ్ల్యూహెచ్‌వో శుక్రవారం ‘కొన్ని కేసులు’గా మార్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని