బెంగాల్‌ ఆస్పత్రుల్లో మొబైల్స్‌ నిషేధం

ఆస్పత్రుల్లో మొబైల్‌ ఫోన్ల వాడకాన్ని బెంగాల్‌ ప్రభుత్వం నిషేధించింది. అవి కరోనా వైరస్‌ను మోసుకొచ్చే ప్రమాదం ఉండటమే కారణమని వెల్లడించింది. కాగా ఐసోలేషన్‌కు సంబంధించిన ఓ వీడియో వైరల్‌ కావడంతోనే మమత సర్కారు ఇలా చేసిందని భాజపా విమర్శించింది. ఆ వీడియోలో రెండు మృతదేహాలు ...

Published : 22 Apr 2020 22:43 IST

రోగుల మధ్య మృతదేహాల వైరల్‌ వీడియో కారణం!

కోల్‌కతా: ఆస్పత్రుల్లో మొబైల్‌ ఫోన్ల వాడకాన్ని బెంగాల్‌ ప్రభుత్వం నిషేధించింది. అవి కరోనా వైరస్‌ను మోసుకొచ్చే ప్రమాదం ఉండటమే కారణమని వెల్లడించింది. కాగా ఐసోలేషన్‌కు సంబంధించిన ఓ వీడియో వైరల్‌ కావడంతోనే మమత సర్కారు ఇలా చేసిందని భాజపా విమర్శించింది. ఆ వీడియోలో రెండు మృతదేహాలు బాధితుల మధ్యనే ఉండటం గగుర్పాటు కలిగిస్తోంది.

ఆస్పత్రుల్లో వైద్యులు, వైద్య సిబ్బంది, రోగులు మొబైల్‌ ఫోన్లు వాడటం నిషేధిస్తున్నామని బెంగాల్‌ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ సిన్హా ఈ రోజు ప్రకటించారు. ఐసోలేషన్‌ వార్డుల్లో రోగులు మాట్లాడేందుకు ల్యాండ్‌లైన్లు, ఇంటర్‌కామ్‌ పెట్టిస్తామని వెల్లడించారు. అయితే అందరూ స్పర్శించే వీటిద్వారా కరోనా వైరస్‌ సోకదా అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం వైరల్‌ అయిన వీడియో కోల్‌కతాలోని ఎంఆర్‌ బంగుర్‌ నోడల్‌ ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డుకు సంబంధించిందని సమాచారం. ఈ వీడియోలో రెండు మృతదేహాలను అలాగే మంచాలపై ఉంచారు. ఆస్పత్రి సిబ్బంది అక్కడి నుంచి తరలించలేదు. మిగతా రోగులు బిక్కుబిక్కుమంటూ అక్కడే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ వైరల్‌ వీడియో వాస్తవమా? నకిలీదా స్పష్టం చేయాలని కేంద్రమంత్రి బాబుల్‌ సుప్రియో బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని డిమాండ్‌ చేశారు.

‘ఈ వీడియో అన్ని ఆన్‌లైన్‌ వేదికల్లో వైరల్‌ అయినప్పటికీ బెంగాల్‌ ప్రభుత్వం ఇంకా స్పష్టతనివ్వకపోవడం గమనార్హం. అసలీ వీడియో నిజమో అబద్ధమో రాష్ట్ర ప్రభుత్వం, సీఎం మమతా బెనర్జీ, అధికారులు వివరణ ఇవ్వలేదు. అంటే ఈ వీడియో నిజమనే నమ్మాల్సి వస్తోంది’ అని బాబుల్‌ సుప్రియో ట్వీట్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని