లాక్‌డౌన్‌: 7 రోజులకు టికెట్ల ద్వారా రైల్వే ఆదాయం ఎంతంటే...

రైళ్ల సీటింగ్‌ సామర్ధ్యం కంటే అధికంగా టికెట్లు బుక్ కావటంపై అధికారులు స్పందించారు.

Updated : 15 May 2020 02:05 IST

దిల్లీ: కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ నిబంధనలను క్రమేణా సడలిస్తున్న కేంద్ర  ప్రభుత్వం, మే 12 నుంచి దశల వారీగా కొన్ని రైళ్లను కూడా నడపాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకు అనుగుణంగా మంగళవారం నుంచి రాజధాని దిల్లీ, వివిధ నగరాల మధ్య 15 ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న ఏడు రోజుల్లో ప్రయాణించేందుకు రెండు లక్షల మందికి పైగా ప్రయాణీకులు రూ.45.30 కోట్ల విలువగల టికెట్లను బుక్‌ చేసుకున్నట్టు రైల్వే శాఖ తెలిపింది. బుధవారం నడిచిన తొమ్మిది రైళ్లలో 9000కు పైగా ప్రయాణీకులు దేశ రాజధానికి తరలి వెళ్లారని అధికారులు తెలిపారు. ప్రత్యేక రైళ్లలో బుధవారం ఒక్కరోజే 20,149 మంది  ప్రయాణించగా... గురువారం కోసం 25,737 మంది టికెట్లు బుక్‌ చేసుకున్నట్టు వారు తెలిపారు. టికెట్ల రూపంలో ఇప్పటి వరకూ రూ.45,30,09,675 మొత్తం వసూలయిందని తెలిపారు. కాగా, రైళ్ల సీటింగ్‌ సామర్ధ్యం కంటే అధికంగా టికెట్లు బుక్ కావటంపై అధికారులు స్పందించారు. దీని అర్ధం ప్రయాణీకులు నిలబడి ప్రయాణిస్తున్నారని కాదని... తమ గమ్యస్థానాల వద్ద కొందరు దిగిపోగా, రైలు ఆగినచోట్ల మరికొందరు రైలు ఎక్కటం వల్ల ఈ విధంగా జరుగుతుందని వారు వివరణ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని