ఆ శానిటైజర్లు అత్యంత ప్రమాదకరం

దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మార్కెట్లో నకిలీ శానిటైజర్లు లభ్యమయ్యే ప్రమాదం ఉందని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసులను సీబీఐ అప్రమత్తం చేసింది. అత్యంత విషపూరితమైన..

Published : 15 Jun 2020 23:59 IST

అప్రమత్తంగా ఉండాలని సూచించిన సీబీఐ

దిల్లీ: దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మార్కెట్లో నకిలీ శానిటైజర్లు లభ్యమయ్యే ప్రమాదం ఉందని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసులను సీబీఐ అప్రమత్తం చేసింది. అత్యంత విషపూరితమైన మిథనాల్ రసాయనాన్ని ఉపయోగించి తయారు చేసిన నకిలీ శానిటైజర్లను విక్రయించే ముఠాల కదలికలపై ఇంటర్‌పోల్ హెచ్చరిక నేపథ్యంలో పోలీసులంతా అప్రమత్తంగా ఉండాలని సీబీఐ కోరింది. కొన్ని దేశాల్లో మిథనాల్‌ను ఉపయోగించి నకిలీ హ్యాండ్ శానిటైజర్లు తయారుచేసినట్లు తెలుసుకున్న ఇంటర్‌పోల్ తాజాగా సీబీఐని హెచ్చరించింది. 

‘కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో శానిటైజర్లకు విదేశాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. దీన్నే అదునుగా భావించి కొన్ని ముఠాలు నకిలీ హ్యాండ్ శానిటైజర్లను ఉత్పత్తి చేయడానికి మిథనాల్‌ను వాడుతున్నట్లు తెలిసింది. విషపూరితమైన మిథనాల్ రసాయనం మానవ శరీరానికి అత్యంత ప్రమాదకరమైనది’ అని సీబీఐ వెల్లడించింది. పీపీఈ కిట్లు, ఇతర రక్షణ పరికరాల సరఫరాదారులుగా పేర్కొంటూ కొందరు నేరస్థులు ఆన్‌లైన్ ఖాతాదారులను మోసం చేస్తున్నారని తెలిపింది. భారీగా పెరుగుతున్న ఆన్‌లైన్ ముందస్తు చెల్లింపు మోసాలను కట్టడిచేయాలని హెచ్చరికలు జారీ చేసింది. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని