అమెరికా.. బెదిరింపు చర్యలు మానుకో

టిక్‌టాక్, వీచాట్‌ యాప్‌లను నిషేధిస్తూ అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని చైనా తప్పుబట్టింది. డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై డ్రాగన్‌ మండిపడింది...

Updated : 20 Sep 2020 13:11 IST

హితవు పలికిన చైనా  
టిక్‌టాక్, వీచాట్‌ యాప్‌ల నిషేధాన్ని తప్పుపట్టిన డ్రాగన్‌

బీజింగ్, వాషింగ్టన్‌: టిక్‌టాక్, వీచాట్‌ యాప్‌లను నిషేధిస్తూ అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని చైనా తప్పుబట్టింది. డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై డ్రాగన్‌ మండిపడింది.  తమ సంస్థలపై చర్యలు తీసుకోవడం ద్వారా అమెరికా బెదిరింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించింది. తాజాగా టిక్‌టాక్, వీచాట్‌ యాప్‌లను నిషేధిస్తున్నట్లు అమెరికా చేసిన ప్రకటనపై చైనా వాణిజ్యశాఖ స్పందించింది. బెదిరింపు చర్యలకు పాల్పడటంతో పాటు చైనా కంపెనీలపై తీసుకుంటున్న అనైతిక చర్యలను మానుకోవాలని ట్రంప్‌ సర్కారుకు సూచించింది. అంతర్జాతీయ నియమాలను పాటిస్తూ నైతికత, పారదర్శకతతో కార్యకలాపాలను నిర్వహించాలని విజ్ఞప్తి చేసింది. ‘‘ఎటువంటి ఆధారాలు లేనప్పుడు, అనవసరమైన కారణాల వల్ల రెండు సంస్థలను అణచివేయడానికి అమెరికా తన అధికారాన్ని ఉపయోగించుకుంటోంది. తద్వారా అంతర్జాతీయ పెట్టుబడిదారుల విశ్వాసాన్ని దెబ్బతీస్తోంది. తక్షణం ఇలాంటి చర్యలను ఆపి అంతర్జాతీయ నియమ నిబంధనలను పరిరక్షించాలి. ఒకవేళ ఇలాగే ఏకపక్ష ధోరణితో ముందుకెళ్తే మాత్రం దీటుగా స్పందిస్తాం. తమ కంపెనీల ప్రయోజనాలను కాపాడటానికి అవసరమైన చర్యలకు ఉపక్రమించక తప్పదు’’ అని చైనా వాణిజ్యశాఖ స్పష్టం చేసింది.

ట్రంప్‌ నిర్ణయంపై టిక్‌టాక్‌ దావా
అమెరికాలో టిక్‌టాక్, వీచాట్‌లపై నిషేధం విధించిన నేపథ్యంలో టిక్‌టాక్‌ మాతృసంస్థ  బైట్‌డ్యాన్స్‌ న్యాయ పోరాటానికి సన్నద్ధమైంది. నిబంధనలకు విరుద్ధంగా యాప్‌పై నిషేధం విధించారంటూ ట్రంప్‌ పాలకవర్గంపై కోర్టులో దావా వేసింది. నిషేధం ఎత్తివేసేలా ఆదేశించాలని ఫెడరల్‌ న్యాయమూర్తిని కోరింది. ట్రంప్‌పై టిక్‌టాక్‌.. కోర్టుకు వెళ్లడం ఇది రెండోసారి. తాజా చర్యతో అమెరికా, చైనా మధ్య నెలకొన్న సాంకేతిక పోరు మరింత తీవ్ర రూపం దాల్చినట్లైంది. ట్రంప్‌ తన రాజకీయ ప్రయోజనాల కోసం అధికార పరిధి దాటి వ్యహరించారని టిక్‌టాక్‌ ఆరోపించింది. అమెరికా నిర్ణయం వాక్‌ స్వాతంత్య్రానికి వ్యతిరేకంగా ఉందని తెలిపింది. భద్రత, గోప్యత విషయంలో పౌరుల ప్రయోజనాలను కాపాడుతున్నామన్న ఆధారాలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదని పేర్కొంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని