Natasha Peri: అసాధారణ ప్రతిభతో అమెరికా అగ్ర యూనివర్సిటీని మెప్పించిన బాలిక

భారతీయ అమెరికన్‌ బాలిక ఒకరు తన అసాధారణ ప్రతిభతో అక్కడి ఓ అగ్ర విశ్వవిద్యాలయాన్ని మెప్పించింది. ప్రపంచంలోనే అత్యంత ప్రజ్ఞావంతులైన విద్యార్థుల్లో ఒకరిగా ఆమెను ఆ యూనివర్సిటీ గౌరవించింది. న్యూజెర్సీలోని థెల్మా ఎల్‌ శాండ్‌మియర్‌

Updated : 04 Aug 2021 07:21 IST

11 ఏళ్ల భారతీయ అమెరికన్‌ ప్రజ్ఞను మెచ్చిన అమెరికా వర్సిటీ

వాషింగ్టన్‌: భారతీయ అమెరికన్‌ బాలిక ఒకరు తన అసాధారణ ప్రతిభతో అక్కడి ఓ అగ్ర విశ్వవిద్యాలయాన్ని మెప్పించింది. ప్రపంచంలోనే అత్యంత ప్రజ్ఞావంతులైన విద్యార్థుల్లో ఒకరిగా ఆమెను ఆ యూనివర్సిటీ గౌరవించింది. న్యూజెర్సీలోని థెల్మా ఎల్‌ శాండ్‌మియర్‌ ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న నటాషా పెరి(11) అనే విద్యార్థిని ఈ ఘనత సాధించింది. అమెరికాలోని కళాశాలల్లో ప్రవేశాల కోసం విద్యార్థుల ప్రావీణ్యాన్ని పరీక్షించడానికి స్కాలస్టిక్‌ అసెస్‌మెంట్‌ టెస్ట్‌(ఎస్‌ఏటీ), అమెరికన్‌ కాలేజ్‌ టెస్టింగ్‌(ఏసీటీ) అనే పరీక్షలు నిర్వహిస్తుంటారు. ఇందులో వచ్చిన స్కోరు ఆధారంగా కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఉపకార వేతనాలు కూడా ఇస్తుంటాయి. ప్రముఖ విశ్వవిద్యాలయం జాన్స్‌ హాప్కిన్స్‌ ఆధ్వర్యంలోని సెంటర్‌ ఫర్‌ టాలెంటెడ్‌ యూత్‌(సీటీవై) కూడా ఇదే తరహాలో ప్రపంచవ్యాప్తంగా ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేయడానికి ఏటా పరీక్ష నిర్వహిస్తుంటుంది. ఇందులో హైస్కూల్‌ స్థాయిలో విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షించే అంశాలు ఉంటాయి. 2020-21కిగానూ 84 దేశాల నుంచి సుమారు 19 వేల మంది విద్యార్థులు ఈ పరీక్షలో పోటీపడ్డారు. వారిలో నటాషా 8వ గ్రేడ్‌ స్థాయిలో 90 శాతం మార్కులు సాధించి సత్తా చాటింది. మౌఖిక, రాత పరీక్షలు రెండింటిలోనూ అద్భుతమైన ప్రతిభ చూపింది. దీంతో ఆమె జాన్స్‌ హాప్కిన్స్‌ అందించే ‘హై ఆనర్‌ అవార్డ్స్‌’కు ఎంపికైంది. దీనిపై నటాషా ఆనందం వ్యక్తం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని