World Bank: నచ్చినవారికి  మెచ్చిన ర్యాంకులు!

సులభతర వాణిజ్య విధానాల అమలులో వివిధ దేశాలకు ప్రపంచ ర్యాంకులను ప్రకటించే ప్రక్రియలో అవకతవకలు జరిగినట్లు

Published : 03 Oct 2021 13:50 IST

‘సులభతరం’లో చైనాకు లబ్ధి చేకూర్చినట్లు ఆరోపణలు 
 ప్రపంచ బ్యాంకును వేలెత్తి చూపుతున్న ఆర్థికవేత్తలు

ఈనాడు, హైదరాబాద్‌: సులభతర వాణిజ్య విధానాల అమలులో వివిధ దేశాలకు ప్రపంచ ర్యాంకులను ప్రకటించే ప్రక్రియలో అవకతవకలు జరిగినట్లు బహిర్గతం కావడం సంచలనం సృష్టిస్తోంది. ప్రపంచ వాణిజ్య రంగాన్ని ప్రభావితం చేసే ర్యాంకులు కొన్ని దేశాలకు కోరుకున్నట్లు దక్కడంపై ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రపంచబ్యాంకు ఏటా విడుదల చేసే ఈ ర్యాంకులకు చాలా ప్రాధాన్యముంది. వివిధ దేశాలలో పెట్టుబడులు పెట్టే సంస్థలు వీటిని పరిగణనలోకి తీసుకుంటాయి. గత ఏడాదికి సంబంధించిన గణాంకాల ఆధారంగా విడుదల చేయాల్సిన ర్యాంకులను ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు ప్రపంచబ్యాంకు ఇటీవల ప్రకటించింది. ఈ నిర్ణయం వెనుక అసలు కారణం కొంతకాలం తర్వాత బయటకు వచ్చింది. గతంలో ర్యాంకుల నిర్ణయంలో అవకతవకలు జరిగాయని వచ్చిన సమాచారంపై ఒక న్యాయసేవల సంస్థతో ప్రపంచబ్యాంకు విచారణ చేయించింది. 2018, 2020 సంవత్సరాల్లో విడుదలైన ర్యాంకులలో చైనా, సౌదీ అరేబియా, అజర్‌బైజాన్‌ల  విషయంలో అవకతవకలు జరిగాయని ఆ సంస్థ తేల్చింది. చైనాకు 2018లో అంతకుముందువలే 78వ ర్యాంకు వచ్చింది. వాస్తవానికి అంతకంటే తక్కువ స్థాయి రావలసి ఉందని, చైనా నుంచి ప్రపంచబ్యాంకుకు ఎక్కువ వనరులను సేకరించే ప్రయత్నంలో... దానిని సంతోషపెట్టేందుకు బ్యాంకు యాజమాన్యంలోని ఉన్నతస్థాయి వ్యక్తులు ర్యాంకుల తారుమారుకు పాల్పడినట్లుగా విచారణ నివేదిక పేర్కొంది. అప్పుడు బ్యాంకు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ హోదాలో క్రిష్టలీనా జార్జియేవా ఈ ర్యాంకుల వ్యవహారాలను పర్యవేక్షించారు. ఆమె ప్రస్తుతం అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉండటంతో ఈ వ్యవహారం మరింత సంచలనమైంది. తాను ఏ తప్పు చేయలేదని ఆమె స్పష్టంచేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఐఎంఎఫ్‌ బోర్డు త్వరలో చర్చించనుంది. ఆమెను ఆ పదవిలో కొనసాగించే విషయంపైనా అందులో నిర్ణయం తీసుకోనుంది. చైనాకు అనుకూలంగా వ్యవహరించిన ఆమెపై అమెరికా తీవ్ర ఆగ్రహంతో ఉందని వార్తలు వస్తున్నాయి.

ఈ పరిణామాలన్నీ ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ల ప్రతిష్ఠతో ముడిపడి ఉన్నవి కావడంతో అర్థశాస్త్రంలో నోబెల్‌ అవార్డులు పొందిన వారు, ఇతర నిపుణులు కూడా దీనిపై  స్పందిస్తున్నారు. ‘ప్రపంచబ్యాంకు యాజమాన్యంలో నిజాయతీ లేదని గుర్తించే, దాని ప్రధాన ఆర్థికవేత్త పదవికి 2018 జనవరిలో రాజీనామా చేశా’నని నోబెల్‌ అవార్డు గ్రహీత పాల రోమర్‌ చెబుతున్నారు. చిలీకి... సోషలిస్టు నాయకుడు మిచెల్‌ బ్యాచిలెట్‌ సారథ్యం వహిస్తున్నప్పుడు ర్యాంకును తక్కువ చేసి చూపారని, ఆయన అనంతరం మితవాద నాయకుడు సెబాస్టియన్‌ పినెరా అధ్యక్షుడు అయ్యాక ర్యాంకును మెరుగుపరచారని, ఇలాంటి విషయాలను తాను అప్పుడే క్రిష్టలీనా దృష్టికి తీసుకువెళ్లినట్లు ఆయన తాజాగా వెల్లడించారు. మరో నోబెల్‌ అవార్డు గ్రహీత జోసెఫ్‌.ఇ.స్టిగ్లెజ్‌ దీనికి భిన్నంగా స్పందిస్తున్నారు. ఆయన కూడా గతంలో ప్రపంచ బ్యాంకుకు ప్రధాన ఆర్థికవేత్తగా పనిచేశారు. ర్యాంకుల విభాగంతో ఆయనకు అప్పుడు సంబంధం లేదు. క్రిష్టలీనా 2019లో ఐఎంఎఫ్‌ అధ్యక్ష పదవిని చేపట్టాక అనేక సానుకూల చర్యలు చేపట్టారని, పెద్దగా ఆర్థిక వనరులు లేని దేశాలకు కరోనా సమయంలో భారీ ఎత్తున సంస్థ నుంచి నిధులు వెళ్లేలా చూశారని ఆయన అంటున్నారు. తన దృష్టిలో ర్యాంకుల నివేదిక భయంకరమైనదని, కార్పొరేట్‌ పన్నులు తగ్గించి... కార్మిక చట్టాలను బలహీన పర్చే దేశాలకు మంచి ర్యాంకులు ఇస్తారన్నారు. ఏదేమైనా దెబ్బతిన్న తమ ప్రతిష్ఠను ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌లు ఎలా కాపాడుకుంటాయో చూడాలి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని