Vladimir putin: నాటో ఆటలు సాగవు.. మా జోలికి రావద్దు

రష్యా సరిహద్దులోని ఉక్రెయిన్‌ను తమ సభ్య దేశంగా చేర్చుకొనే యత్నాలను నాటో కట్టిపెట్టాలని.. ఆ ప్రాంతంలో క్షిపణులు, ఇతర భారీ ఆయుధాల

Updated : 27 Feb 2024 18:33 IST

అమెరికాకు పుతిన్‌ హెచ్చరిక

మాస్కో: రష్యా సరిహద్దులోని ఉక్రెయిన్‌ను తమ సభ్య దేశంగా చేర్చుకొనే యత్నాలను నాటో కట్టిపెట్టాలని.. ఆ ప్రాంతంలో క్షిపణులు, ఇతర భారీ ఆయుధాల మోహరింపునకు స్వస్తి చెప్పాలనీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ డిమాండ్‌ చేశారు. ఒకప్పుడు సోవియట్‌ యూనియన్‌ మిత్రదేశాలుగా ఉన్న తూర్పు, మధ్య ఐరోపా దేశాలనూ నాటో దూరంగా ఉంచాలని ఆయన కోరారు. వచ్చే నెలలో జెనీవాలో జరగనున్న చర్చల్లో అమెరికా ఈ దిశగా స్పష్టమైన వైఖరి  చూపాలన్నారు. పూర్వ సోవియట్‌ రిపబ్లిక్‌లను తమ కూటమిలో చేర్చుకోబోమని 1990లలో ఇచ్చిన మాటను అమెరికా నాయకత్వంలోని ఉత్తర అట్లాంటిక్‌ సైనిక కూటమి (నాటో) దేశాలు నిలబెట్టుకోలేదని, తమను మోసం చేశాయంటూ పుతిన్‌ మండిపడ్డారు. ఒకప్పుడు సోవియట్‌ యూనియన్‌ నాయకత్వంలోని వార్సా కూటమి, నాటోల మధ్య ప్రచ్ఛన్నయుద్ధం సాగేది. సోవియట్‌ విచ్ఛిన్నమైన తరవాత వార్సా కూటమి సభ్య దేశాలైన పోలెండ్, హంగరీ, చెక్‌ రిపబ్లిక్, స్లొవేకియా, బల్గేరియా, రొమేనియా, స్లావెనియా, అల్బేనియా, క్రొయేషియా, మాంటెనెగ్రో, ఉత్తర మాసిడోనియా దేశాలు విడతలవారీగా నాటోలో చేరిపోయాయి. ఆ తరవాత పూర్వ సోవియట్‌ రిపబ్లిక్‌లైన ఎస్తోనియా, లాట్వియా, లిథుయేనియా కూడా నాటో సభ్యత్వం తీసుకున్నాయి. ఇప్పుడు తమ పొరుగునే ఉన్న ఉక్రెయిన్‌ వరకు కూడా నాటో చొచ్చుకు వస్తోందన్నది పుతిన్‌ ఆగ్రహానికి కారణం. ఎవరు ఎవరిని బెదరిస్తున్నారంటూ ఆయన నిలదీస్తున్నారు.

‘మేము అమెరికా పొరుగున ఉన్న కెనడా, మెక్సికోల్లా.. బ్రిటన్‌ సరిహద్దుల్లో క్షిపణులను మోహరించామా?’ అని ప్రశ్నించారు. ఒకప్పుడు రష్యాలో అంతర్భాగమైన ఉక్రెయిన్‌ నేడు విడిపోయి స్వతంత్ర దేశంగా ఉంటోంది. ఉక్రెయిన్‌లోని రష్యా అనుకూల శక్తులు దీన్ని నిరసించడంతో గత  ఏడేళ్లుగా అక్కడ అంతర్యుద్ధం కొనసాగుతూ ఇప్పటికే 14,000 మంది మరణించారు. రష్యా 2014లో ఉక్రెయిన్‌లోని క్రిమియాను ఆక్రమించింది. తాజాగా ఉక్రెయిన్‌ ప్రభుత్వం రష్యా అనుకూల శక్తులపై విరుచుకుపడటానికి సిద్ధమవుతోందన్నది పుతిన్‌ ఆరోపణ. అలాంటి ఉద్దేశం తమకు లేదని ఉక్రెయిన్‌ అధికారులు చెబుతున్నారు. నాటో అందించే ఆయుధాలతో ఉక్రెయిన్‌.. రష్యా అనుకూల శక్తులపై దాడికి దిగి క్రిమియాను మళ్లీ స్వాధీనం చేసుకోడానికి ప్రయత్నించవచ్చని పుతిన్‌ సందేహిస్తున్నారు. తమ భద్రతకు అనునిత్యం ముప్పులా నాటో చేసే ప్రయత్నాలను సహించబోమని అంటున్నారు. ఉక్రెయిన్‌కు నాటోలో సభ్యత్వం ఇవ్వకూడదనీ.. తూర్పు, మధ్య ఐరోపాల నుంచి నాటో ఆయుధాలను ఉపసంహరించాలని పుతిన్‌ కోరుతున్నారు. ఈ మేరకు అమెరికా, నాటోల నుంచి ఆయన హామీ కోరుతుండగా.. దీనికి అమెరికా కూటమి సిద్ధంగా లేదు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని