Omicron: రోగ నిరోధకతను ఏమార్చే శక్తి ఒమిక్రాన్‌కే ఎక్కువ

డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్‌ వేరియంట్‌కు రోగనిరోధక వ్యవస్థను ఏమార్చి వ్యాప్తి చెందే శక్తి ఎక్కువగా ఉందని, వచ్చే ఏడాదిలో

Updated : 25 Dec 2021 13:27 IST

 సింగపూర్‌ నిపుణుల వెల్లడి 

సింగపూర్‌: డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్‌ వేరియంట్‌కు రోగనిరోధక వ్యవస్థను ఏమార్చి వ్యాప్తి చెందే శక్తి ఎక్కువగా ఉందని, వచ్చే ఏడాదిలో ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యంత తీవ్రమైన సార్స్‌కోవ్‌-2 స్ట్రైన్‌గా మారనుందని సింగపూర్‌ నిపుణులు వెల్లడించారు. దీనివల్ల కేసుల్లో భారీ పెరుగుదల, ఆసుపత్రుల్లో చేరికలు పెరుగుతాయని సా స్వీ హాక్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ సంస్థకు చెందిన అసోసియేట్‌ ప్రొఫెసర్‌ నటాషా హొవార్డ్‌ పేర్కొన్నారు. ఒమిక్రాన్‌ ప్రభావంపై ఇప్పటికీ స్పష్టత లేదని, అయితే ప్రపంచంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ టీకాలు, బూస్టర్‌ డోసులు అందేవరకూ మహమ్మారి అంతాన్ని ఆశించలేమని, మరిన్ని కొత్త వేరియంట్‌లు ఉత్పన్నమయ్యే ప్రమాదముందని చెప్పారు. ఒమిక్రాన్‌తో రీఇన్‌ఫెక్షన్‌ ముప్పు ఐదు రెట్లు ఎక్కువగా ఉందన్నారు. 1918లో వచ్చిన ఫ్లూ మహమ్మారి ఇంకా పూర్తిగా అంతం కాలేదని, ఇప్పుడు కరోనా అంతం గురించి అంచనా వేయడం వ్యర్థమని సింగపూర్‌ మేనేజ్మెంట్‌ యూనివర్సిటీ అసోసియేట్‌ డైరెక్టర్‌ లిమ్‌ వీ కియట్‌ చెప్పారు. 

ప్రస్తుత వ్యాక్సిన్ల ప్రభావం తక్కువే

వాషింగ్టన్‌: ఒమిక్రాన్‌పై ప్రస్తుత వ్యాక్సిన్లు అంత సమర్థవంతంగా పనిచేయవా? రెండు డోసులేసుకున్నా.. మెరుగైన రక్షణ లభించదా..? బూస్టర్‌ డోసు కూడా సత్ఫలితాలనివ్వదా..? అవుననే అంటోంది తాజా అధ్యయనం. ఒమిక్రాన్‌ వేరియంట్‌పై ప్రస్తుత టీకాలు, చికిత్సా విధానాలు ప్రభావం అంతగా లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. టీకాల తయారీ, చికిత్సా విధానంలో మార్పులు చేయాల్సిన అవసరాన్ని ఈ అధ్యయనం నొక్కి చెప్పింది. ఫైజర్, మోడెర్నా, జాన్సన్‌ అండ్‌ జాన్సన్, ఆస్ట్రాజెనెకా లాంటి టీకాల సమర్థతను శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో పరీక్షించారు. ఇందులో కనుగొన్న ఫలితాల ప్రకారం...రెండు డోసుల టీకా వేసుకున్నా ఒమిక్రాన్‌ సంక్రమణ నుంచి రక్షణ కలుగుతుందని చెప్పలేమని తేలింది. అంతేకాదు.. ఈ వేరియంట్‌పై బూస్టర్‌ డోసు చూపే ప్రభావం అంతంత మాత్రమేనని నిర్ధారించారు. ఒమిక్రాన్‌ స్పైక్‌ ప్రోటీన్‌లో ప్రమాదకర సంఖ్యలో ఉత్పరివర్తనాలు జరగడమే దీనికి కారణమని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ అధ్యయనాన్ని యూనివర్సిటీ ఆఫ్‌ హాంకాంగ్‌తో కలిసి.. అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయం చేసింది. ‘నేచర్‌ జర్నల్‌’ ప్రచురించింది.

మల్టీవిటమిన్‌ మాత్రలు.. పారాసెటమాల్‌...బాధితులకు వీటితోనే చికిత్స 

 

దిల్లీ: ఒమిక్రాన్‌ సోకిన బాధితులకు మల్టీ విటమిన్‌ మాత్రలు, పారాసెటమాల్‌ను మాత్రమే ఉపయోగిస్తున్నట్లు దిల్లీలోని లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌(ఎల్‌ఎన్‌జేపీ) ఆస్పత్రిల సీనియర్‌ వైద్యులు తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 40 మంది ఒమిక్రాన్‌ బాధితులు తమ ఆసుపత్రిలో చేరారని, వీరిలో 19 మందికి స్వస్థత చేకూరడంతో డిశ్చార్జి అయ్యారని వెల్లడించారు. ఈ వేరియంట్‌ సోకిన వారిలో 90శాతం మందికి ఎలాంటి లక్షణాలు లేవని చెప్పారు. మిగతా వారికి గొంతునొప్పి, జ్వరం, ఒళ్లు నొప్పులు వంటి స్వల్ప లక్షణాలు కనిపించాయని వివరించారు. అందుకే వారికి ఇతర ఔషధాలు ఇవ్వాల్సిన అవసరం రాలేదని స్పష్టం చేశారు. ఆసుపత్రిలో చేరిన 40 మందీ విదేశాల నుంచి వచ్చిన వారేనని, విమానాశ్రయంలో పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలిందన్నారు. అందరూ టీకా రెండు డోసులూ తీసుకున్నారు. ముగ్గురు బూస్టర్‌ డోసు కూడా వేసుకున్నారని పేర్కొన్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం దిల్లీలో శుక్రవారం వరకు 67 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో 23 మంది కోలుకున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని