EPF:కొవిడ్‌ కాలంలో ఊరట.. పీఎఫ్‌

కరోనా సమయంలో వేతన జీవులు ఉద్యోగుల భవిష్యనిధి నుంచి భారీ మొత్తంలో నిధులు ఉపసంహరించారు. 

Published : 26 Dec 2021 09:51 IST

 1.7 లక్షల కోట్ల రూపాయల ఉపసంహరణ 
 ఏడాదిన్నరలో కరోనా  క్లెయిమ్‌లు 1.21 కోట్లు 
65 వేల కుటుంబాలకు ఈడీఎల్‌ఐ పరిహారం 

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా సమయంలో వేతన జీవులు ఉద్యోగుల భవిష్యనిధి నుంచి భారీ మొత్తంలో నిధులు ఉపసంహరించారు. కరోనా తొలిదశ మొదలైనప్పటి నుంచి రెండోదశ ముగిసే వరకు దాదాపు రూ.1.7 లక్షల కోట్లు వెనక్కి తీసుకున్నారు. నగదు ఉపసంహరణ కింద 4.63 కోట్ల క్లెయిమ్‌లు వచ్చాయి. కరోనాతో ఉపాధి కోల్పోవడంతో వేతన జీవులకు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. వైరస్‌ సోకడంతో వైద్య ఖర్చుల కోసం భారీగా ఖర్చు చేశారు. ఈ ఇక్కట్ల నుంచి గట్టెక్కేందుకు ఈపీఎఫ్‌ నిధుల్ని ఎక్కువగా వినియోగించుకున్నారు. కరోనా సమయంలో ఉద్యోగులు తమ ఈపీఎఫ్‌ ఖాతాల నుంచి మూణ్నెల్ల వేతనం (బేసిక్‌+డీఏ) లేదా 90 శాతం నిల్వలో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకునేందుకు అవకాశం కల్పించింది. తొలివిడత కరోనా సమయంలో ఒకసారికి అనుమతి ఇచ్చినా, రెండో విడత సమయంలో రెండుసార్లు తీసుకునే వెసులుబాటు కల్పించింది. కరోనా కేటగిరీలో ఈపీఎఫ్‌వోకు 1.21 కోట్ల క్లెయిమ్‌లు అందినట్లు ఈపీఎఫ్‌వో వెల్లడించింది. ఇప్పటివరకు రూ.28,288 కోట్ల సొమ్మును కార్మికులు వెనక్కి తీసుకున్నారు. ఒక్కో క్లెయిమ్‌ కింద సగటున రూ.23,378 లభించాయి. సాధారణ, వైద్య క్లెయిమ్‌ల కింద 3.42 కోట్లు అందగా, వీటిని పరిష్కరించి రూ.1.42 లక్షల కోట్లు కార్మికుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. 

భారీగా ఈడీఎల్‌ఐ క్లెయిమ్‌లు 

కరోనా కోరల్లో చిక్కిన వేతన జీవుల్లో కొందరు చికిత్సకు కోలుకోగా.. మరికొందరు చనిపోయారు. ఈపీఎఫ్‌వో చందాదారులకు ఉద్యోగి డిపాజిట్‌ ఆధారిత జీవిత బీమా(ఈడీఎల్‌ఐ) సౌకర్యం ఉంది. ఈ బీమా కింద ప్రమాదవశాత్తు చనిపోయిన కార్మికుడి కుటుంబానికి కనీసం రూ.2.5 లక్షల నుంచి గరిష్ఠంగా రూ.7 లక్షలు భవిష్యనిధి సంస్థ ఇస్తోంది. కొవిడ్‌ సమయంలో ఈడీఎల్‌ఐ బీమా కింద 65 వేల క్లెయిమ్‌లు ఈపీఎఫ్‌వో పరిష్కరించింది. కరోనా తొలిదశతో పోల్చితే రెండోదశ చివర నాటికి క్లెయిమ్‌ల సంఖ్య భారీగా పెరిగింది. రెండో దశ తరవాత జులై- సెప్టెంబరు కాలంలో 22 వేల క్లెయిమ్‌లు వచ్చాయి.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని