
Supreme Court: అవినీతిపై దర్యాప్తు నిలిపివేతకు సుప్రీం నిరాకరణ
అరెస్టు నుంచి ఛత్తీస్‌గఢ్ ఐపీఎస్ అధికారికి లభించని ఉపశమనం
దిల్లీ: తనపై నమోదైన అవినీతి కేసులో కొనసాగుతున్న దర్యాప్తును నిలిపివేయాలని, అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలని కోరుతూ సస్పెన్షన్‌లో ఉన్న ఛత్తీస్‌గఢ్ ఐపీఎస్ అధికారి గుర్జీందర్ పాల్ సింగ్ చేసుకున్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న రాజకీయ ప్రతీకార చర్యలకు తాను బాధితుడిగా మారానని ఆ అధికారి పేర్కొన్నారు. పిటిషనర్ అభ్యర్థనను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కొహ్లీలతో కూడిన ధర్మాసనం తిరస్కరించింది. రాష్ట్ర పోలీసు విభాగానికి చెందిన అవినీతి నిరోధక (ఆర్థిక నేరాల) విభాగం చేస్తున్న దర్యాప్తును నిలిపివేయాలని కోరుతూ గుర్జీందర్ పాల్ చేసుకున్న అభ్యర్థనను నవంబరు 26న ఛత్తీస్‌గఢ్ హైకోర్టు తోసిపుచ్చడంతో ఆయన సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసుకున్నారు. సర్వోన్నత న్యాయస్థానంలోనూ ఆయనకు ఊరట లభించలేదు. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిందని చెబుతున్న పౌర సరఫరాల కార్పొరేషన్ కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి, ఆయన భార్యపై చర్యలు తీసుకోవాలని అవినీతి నిరోధక విభాగం అధిపతిగా ఉన్న సమయంలో ప్రస్తుత ప్రభుత్వం పదే పదే తనపై ఒత్తిడి తెచ్చిందని గుర్జీందర్ పాల్ పిటిషన్‌లో తెలిపారు. సరైన ఆధారాలు లేనందున తాను చర్యలు తీసుకోలేనని తెలపడంతో ప్రస్తుత ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగిందని పేర్కొన్నారు. 1994 బ్యాచ్‌కు చెందిన ఈ ఐపీఎస్ అధికారి రాష్ట్రంలో భాజపా అధికారంలో ఉన్న సమయంలో రాయ్‌పుర్, దుర్గ్, బిలాస్‌పుర్ ఐజీగా పనిచేశారు. ఛత్తీస్‌గఢ్ పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా ఉన్న ఆయనను ప్రస్తుత ప్రభుత్వం సస్పెండ్ చేసింది. గుర్జీందర్ పాల్‌పై అవినీతి, దేశద్రోహం, దోపిడీ కేసులు నమోదు చేయగా గత ఏడాది అక్టోబరు 1న అవినీతి మినహా రెండు కేసుల్లో కఠిన చర్యలను నిలిపివేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. పోలీస్ అధికారులు రాజకీయ నాయకులతో కుమ్మక్కవుతున్నారని ఆక్షేపించింది. గుర్జీందర్ పాల్ పిటిషన్‌పై 8వారాల్లో నిర్ణయం వెలువరించాలని ఛత్తీస్‌గఢ్ హైకోర్టుకు సూచించింది. ఆదాయానికి మించి ఆస్తులున్న అవినీతి కేసులో ఆ అధికారికి అనుకూలమైన ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు కూడా తిరస్కరించింది.
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ల్లో ఓబీసీ రిజర్వేషన్లపై 17న సుప్రీంకోర్టు విచారణ
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ల్లో ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలపై ఈ నెల 17న విచారణ చేపట్టనున్నట్లు సుప్రీం కోర్టు వెల్లడించింది. ఈ వ్యవహారంలో తాము గత ఏడాది డిసెంబరు 17న జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని కోరుతూ కేంద్రం దాఖలు చేసిన దరఖాస్తు అదే రోజు విచారణకు వస్తుందని జస్టిస్ ఎ.ఎం.ఖాన్‌విల్కర్, జస్టిస్ సి.టి.రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం తెలిపింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ల్లో స్థానిక సంస్థల్లో ఓబీసీలకు కేటాయించిన సీట్లను జనరల్ కేటగిరీలో రీనోటిఫై చేయాలని ఆ రాష్ట్రాల ఎన్నికల కమిషన్లను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించిన సంగతి గమనార్హం.
సువేందు అధికారిపై పిటిషన్ కొట్టివేత
పశ్చిమబెంగాల్‌కు చెందిన భాజపా ఎమ్మెల్యే సువేందు అధికారిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ జరపకుండా స్టే విధిస్తూ కలకత్తా హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వుపై అప్పీలును అక్కడి ద్విసభ్య ధర్మాసనం తోసిపుచ్చడం మీద పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దీనిని దాఖలు చేసింది. ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వును ఇప్పటికే సుప్రీంకోర్టులో సవాల్ చేశారని, దానిపై గత నెల 13నే తీర్పు సయితం వెలువడిందని జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ ఎ.ఎస్.బోపన్నల ధర్మాసనం సోమవారం పేర్కొంది. సుప్రీంకోర్టులో వాదనలన్నీ అయ్యాక కలకత్తా హైకోర్టు డివిజన్ బెంచ్ ఎదుట మళ్లీ అప్పీలు చేసే ప్రశ్న ఎక్కడుందని బెంగాల్ సర్కారు తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. అదే అంశం మీద పదేపదే విచారణ చేపట్టలేమని స్పష్టం చేసింది. సువేందు అధికారి అంగరక్షకుడు హత్యకు గురికావడంపై సీఐడీ జారీచేసిన సమన్లపై కలకత్తా హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం నాలుగు నెలల క్రితం తాత్కాలిక ఉపశమనం కల్పించింది. ఆయనపై ఎలాంటి నిర్బంధ చర్యలు చేపట్టరాదని ఆదేశించింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.