మా మంత్రం.. వెనుకబడ్డవారికి ప్రాధాన్యం

సమాజంలో వెనుకబడ్డ, నిర్లక్ష్యానికి గురైన ప్రతి వర్గానికి సాధికారత కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.

Updated : 29 Jan 2023 06:13 IST

గుర్జర్ల ఆధ్యాత్మిక వేడుకలో ప్రధాని మోదీ

జైపుర్‌: సమాజంలో వెనుకబడ్డ, నిర్లక్ష్యానికి గురైన ప్రతి వర్గానికి సాధికారత కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. వెనుకబడ్డవారికి ప్రాధాన్యం (వంచిత్‌ కో వరీయతా) అన్నది ఓ మంత్రంలా ఆచరిస్తూ తమ ప్రభుత్వం ముందుకు వెళుతోందన్నారు. రాజస్థాన్‌లోని భీల్వాడా జిల్లాలో శనివారం జరిగిన గుర్జర్ల ఆరాధ్యదైవం శ్రీ దేవనారాయణ్‌ భగవాన్‌ 1,111వ అవతార మహోత్సవానికి ప్రధాని హాజరయ్యారు. స్థానిక మాలాసేరీ డూంగరీ గ్రామ ఆలయంలో ప్రార్థనల అనంతరం ప్రజలనుద్దేశించి మోదీ మాట్లాడుతూ..  ఈ కార్యక్రమానికి ఓ శిష్యుడిలా తాను వచ్చానని చెప్పారు. దేశ స్వాతంత్య్ర సంగ్రామంతోపాటు పలు ఉద్యమాల్లో కీలకపాత్ర పోషించిన గుర్జర్లకు చరిత్రలో తగిన ప్రాధాన్యం కల్పించకపోవడం దురదృష్టకరం అన్నారు. గతకాలపు తప్పులను సరిదిద్దుతూ నవీన భారతాన్ని తాము నిర్మిస్తున్నామని, జాతి ఐక్యతకు భంగం కలిగించే అంశాలకు ప్రజలు దూరంగా ఉండాలని ప్రధాని పిలుపునిచ్చారు. దేవనారాయణ్‌ భగవాన్‌ సామాజిక సేవ, ప్రజా సంక్షేమానికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారని.. ఇందుకు అనుగుణంగానే ఉచిత రేషను, ఆరోగ్యానికి ఆయుష్మాన్‌ భారత్‌ వంటి కార్యక్రమాలను తాము అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. రాజస్థాన్‌ రైతులకు పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద రూ.15,000 కోట్లకు పైగా ఆర్థికసాయం అందజేశామన్నారు. దేవనారాయణ్‌ భగవాన్‌ కమలంపై అవతరించారని, ఈ ఏడాది భారత్‌ అధ్యక్షత వహిస్తున్న జీ20 కూటమి చిహ్నం కూడా కమలమేనని ప్రధాని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు