గోధ్రా రైలు బోగీ దహనం కేసు దోషులకు బెయిల్‌పై మీ స్పందనేంటి?

గుజరాత్‌లో 2002లో జరిగిన గోధ్రా రైలు బోగీ దహనం కేసులో జీవిత ఖైదు శిక్ష పడిన నిందితుల్లో కొందరి బెయిల్‌ పిటిషన్లపై స్పందన తెలియజేయాలని గుజరాత్‌ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు సోమవారం కోరింది. ‘‘కొందరు తాము రాళ్లు మాత్రమే విసిరామని చెబుతున్నారు.

Published : 31 Jan 2023 04:31 IST

గుజరాత్‌ ప్రభుత్వాన్ని కోరిన సుప్రీం

దిల్లీ: గుజరాత్‌లో 2002లో జరిగిన గోధ్రా రైలు బోగీ దహనం కేసులో జీవిత ఖైదు శిక్ష పడిన నిందితుల్లో కొందరి బెయిల్‌ పిటిషన్లపై స్పందన తెలియజేయాలని గుజరాత్‌ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు సోమవారం కోరింది. ‘‘కొందరు తాము రాళ్లు మాత్రమే విసిరామని చెబుతున్నారు. కానీ ఓ బోగీని తలుపులు తెరుచుకోకుండా బయట నుంచి బంధించేసి..ఆపై దానికి నిప్పు పెట్టి.. ఆ తరువాత దానిపై రాళ్లు విసరడమంటే ఏదో కేవలం రాళ్లు విసరడం కాదు. ఆ దుర్ఘటనలో రైల్లోని అనేక మంది మృత్యువాత పడ్డారు’’ అని గుజరాత్‌ ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహా, జస్టిస్‌ జె.బి.పార్దివాలాల ధర్మాసనానికి వివరించారు. ఈ సందర్భంగా ఈ బెయిల్‌ పిటిషన్‌ కేసును రెండు వారాల అనంతరం విచారణ జాబితాలో చేరుస్తామని ధర్మాసనం మెహతాకు తెలిపింది. ఈ కేసులో దోషులుగా తేలిన కొందరి మరణశిక్షను గుజరాత్‌ హైకోర్టు జీవిత ఖైదుగా మార్చడంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్పీలుకు వెళ్లిందని కొందరు దోషుల తరఫున హాజరైన సీనియర్‌ న్యాయమూర్తి సంజయ్‌ హెగ్డే ధర్మాసనానికి వివరించారు. ఈ నేపథ్యంలో అబ్దుల్‌ రహమాన్‌ ధాంతియా అలియాస్‌ కాన్‌కాటో, అబ్దుల్‌ సత్తార్‌ ఇబ్రహీం గడ్డీ అస్లా తదితరుల బెయిల్‌ అభ్యర్థనల కేసులో అభ్యంతరాలు ఉంటే తెలపాలంటూ గుజరాత్‌ ప్రభుత్వానికి సుప్రీం ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని