Budget 2023: ఆరోగ్యానికి స్వస్థ్య.. ఆవిష్కరణలతో చికిత్స!

కేంద్ర ప్రభుత్వం వైద్యరంగానికి గతేడాదితో పోల్చితే ఈ బడ్జెట్‌లో స్వల్పంగా నిధులను పెంచింది. ఆ రంగానికి రూ.89,155 కోట్లను ప్రతిపాదించింది.

Updated : 02 Feb 2023 05:23 IST

వైద్య రంగానికి రూ.89,155 కోట్లు
157 నర్సింగ్‌ కళాశాలల ఏర్పాటుకు నిర్ణయం

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం వైద్యరంగానికి గతేడాదితో పోల్చితే ఈ బడ్జెట్‌లో స్వల్పంగా నిధులను పెంచింది. ఆ రంగానికి రూ.89,155 కోట్లను ప్రతిపాదించింది. గత బడ్జెట్‌లో కేటాయించిన దాని (రూ.79,145 కోట్లు) కంటే ఇది 13 శాతం అదనం. ఆయుష్‌ మంత్రిత్వ శాఖకు రూ.3,647.50 (గత బడ్జెట్‌ కంటే 20 శాతం అదనం) కోట్లు కేటాయించింది. ప్రతిపాదించిన మొత్తంలో రూ.86,175 కోట్లను ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖకు, రూ.2,980 కోట్లను వైద్య పరిశోధనల విభాగానికి కేటాయించినట్లు కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్‌ తన ప్రసంగంలో వివరించారు. 2014 నుంచి ఇప్పటి వరకు నెలకొల్పిన 157 వైద్య కళాశాలలకు అనుబంధంగా 157 నర్సింగ్‌ కళాశాలలను ఏర్పాటు చేయాలని కేంద్రం తాజా బడ్జెట్‌లో నిర్ణయించింది.

2047 నాటికి సికిల్‌సెల్‌ ఎనీమియా నిర్మూలన!

దేశవ్యాప్తంగా 2047 నాటికి సికిల్‌సెల్‌ ఎనీమియా వ్యాధి నిర్మూలనే లక్ష్యంగా ప్రత్యేక మిషన్‌ను ప్రారంభించనున్నట్లు నిర్మలాసీతారామన్‌ ప్రకటించారు. ఈ వ్యాధి ప్రభావిత ఏజెన్సీ ప్రాంతాల్లోని 40 ఏళ్ల వయసులోపు 7 కోట్ల మంది గిరిజనులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తామని, వ్యాధిపై అవగాహన కల్పిస్తామని వివరించారు. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ప్రధానమంత్రి స్వస్థ్య సురక్షా యోజన(పీఎంఎస్‌ఎస్‌వై)ను రెండుగా విభజిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దాన్ని పీఎంఎస్‌ఎస్‌వైతోపాటు కొత్తగా నెలకొల్పనున్న ఎయిమ్స్‌ స్థాపన వ్యయాన్ని ప్రత్యేకంగా పేర్కొననున్నట్లు తెలిపింది. ఈ బడ్జెట్‌లో పీఎంఎస్‌ఎస్‌వైకు రూ.3,365 కోట్లు, 22 కొత్త ఎయిమ్స్‌ల స్థాపనకు రూ.6,835 కోట్లుగా కేటాయించింది. గతేడాది పీఎంఎస్‌ఎస్‌వైకు రూ.10 వేల కోట్లు ప్రతిపాదించింది.

పరిశోధనలు, ఆవిష్కరణలకు ఊతం

పరిశోధనలు, ఆవిష్కరణల ప్రోత్సాహానికి కేంద్రం పలు నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా.. ఎంపిక చేసిన ఐసీఎంఆర్‌ ల్యాబ్‌లలో పరిశోధన చేసేందుకు ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లోని బోధనా సిబ్బందికి అనుమతి ఇస్తుంది. అందుకు అవసరమైన సదుపాయాలూ కల్పిస్తుంది. వైద్య సంస్థల్లో భవిష్యత్‌ మెడికల్‌ టెక్నాలజీ, ఉత్తమ ఉత్పత్తులు, పరిశోధనలకు అవసరమైన నిపుణుల కోసం వైద్య పరికరాల(మెడికల్‌ డివైస్‌)ను ఉపయోగించడంలో మెలకువలు తెలిపేందుకు ప్రత్యేక కోర్సులు ప్రవేశపెట్టనుంది. ఫార్మా రంగంలో పరిశోధనలు, ఆవిష్కరణలను సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ద్వారా ప్రమోట్‌ చేయనున్నట్లు ఆర్థికమంత్రి వివరించారు. వైద్య రంగానికి సంబంధించిన పరిశోధన, పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహిస్తామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని