హజ్‌ యాత్రకు విధివిధానాల విడుదల

దేశవ్యాప్తంగా 25 ప్రాంతాల నుంచి హజ్ యాత్రకు బయలుదేరొచ్చని. త్వరలో దరఖాస్తులు ఉచితంగా అందుబాటులోకి తెస్తామని అల్పసంఖ్యాక వర్గాల మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది.

Published : 07 Feb 2023 04:34 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా 25 ప్రాంతాల నుంచి హజ్ యాత్రకు బయలుదేరొచ్చని. త్వరలో దరఖాస్తులు ఉచితంగా అందుబాటులోకి తెస్తామని అల్పసంఖ్యాక వర్గాల మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. హజ్‌ యాత్రకు సంబంధించిన కొత్త విధి విధానాలు యాత్రికులకు ఆర్థికంగా ఊరటనిస్తాయని ప్రకటించింది.

ఇక్కడి నుంచి..

యాత్రకు బయలుదేరే ప్రాంతాల్లో.. శ్రీనగర్‌, రాంచి, గయ, గువాహటి, ఇందౌర్‌, భోపాల్‌, మంగళూరు, గోవా, ఔరంగాబాద్‌, వారణాసి, జైపుర్‌, నాగ్‌పుర్‌, దిల్లీ, ముంబయి, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్‌, కొచ్చిన్‌, చెన్నై, అహ్మదాబాద్‌, లఖ్‌నవూ, కన్నూర్‌, విజయవాడ, అగర్తలా, కాలికట్‌ ఉన్నాయి.

ఇవీ నిబంధనలు..

నూతన విధానంలో భారత ప్రభుత్వానికి కేటాయించిన కోటాలో 80 శాతం హజ్‌ కమిటీకి, 20 శాతం ప్రైవేటు ఆపరేటర్లకు ఇవ్వనున్నారు. యాత్ర ప్యాకేజీని రూ.50 వేలకు తగ్గించారు. హజ్‌ కమిటీ వద్ద డిపాజిట్‌ చేసిన నగదును ఫారన్‌ ఎక్స్ఛేంజ్‌ వద్ద జమ చేస్తారు. దుప్పట్లు, సంచులు, గొడుగులు వంటివి యాత్రికులే తెచ్చుకోవాల్సి ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. హజ్‌ కమిటీ ఆఫ్‌ ఇండియా ద్వారా గతంలో యాత్ర చేసిన వారు దరఖాస్తు చేసేందుకు అనర్హులు. మహిళలు, 70 ఏళ్లు పైపడిన వృద్ధులకు  సహాయకులుగా వెళ్లేవారు, గతంలో వెళ్లి.. మళ్లీ ఇప్పుడు బయలుదేరిన వారిని అదనపు చెల్లింపులతో అనుమతిస్తారు. 45 ఏళ్ల వయసు పైపడిన మహిళలు ‘సహాయకుడు’ లేకుండా యాత్రకు వెళ్లాలనుకుంటే నలుగురైదుగురితో కూడిన సమూహంతో అనుమతిస్తారు. సౌదీ అరేబియా, హజ్‌ కమిటీ ఇండియా నిబంధనల ప్రకారం.. ఒక్కరే హజ్‌ యాత్రకు వెళ్లాలనుకునే మహిళలు సమూహంగా ఏర్పడి దరఖాస్తు చేసుకోవచ్చు. వీరికి జెడ్డాలోని భారత కాన్సులేట్‌ జనరల్‌ సౌకర్యాలు కూడా కల్పిస్తారు.

దరఖాస్తు ఇలా..

నలుగురికి మించకుండా కుటుంబ సభ్యులు, బంధువుల దరఖాస్తులను ఒక కవరులో సమర్పించొచ్చు. ఆయా రాష్ట్రాలకు కేటాయించే సీట్లలో 70 ఏళ్ల వయసు పైపడిన వారు, మహిళలు, దివ్యాంగులకు ప్రాధాన్యం ఇస్తారు. యాత్రకు వెళ్లేవారు అవసరమైన ఆరోగ్య ధువపత్రాలు సమర్పించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. దరఖాస్తులను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని హజ్‌ కమిటీల వద్ద ఉచితంగా పొందవచ్చు. hajcommittee. gov.in వెబ్‌సైట్‌లో కూడా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. గతంలో దరఖాస్తు వెల రూ.300 ఉండగా ఇప్పుడు ఉచితంగా అందజేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని