సంక్షిప్త వార్తలు(2)

కొవిడ్‌ చికిత్సలో ప్రస్తుతం వినియోగిస్తున్న పాక్స్‌లవిడ్‌ ఔషధం క్రమంగా ప్రభావరహితంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి! ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కువగా వ్యాప్తిలో ఉన్న కరోనా (సార్స్‌-కొవ్‌-2) వేరియంట్లు ఈ ఔషధ నిరోధక సామర్థ్యాన్ని సముపార్జించుకుంటుండటమే ఇందుకు కారణం.

Updated : 31 Mar 2023 05:49 IST

ప్రభావరహితంగా మారనున్న పాక్స్‌లవిడ్‌

ఈ ఔషధ నిరోధకతను కరోనా సముపార్జించుకుంటుండటమే కారణం

దిల్లీ: కొవిడ్‌ చికిత్సలో ప్రస్తుతం వినియోగిస్తున్న పాక్స్‌లవిడ్‌ ఔషధం క్రమంగా ప్రభావరహితంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి! ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కువగా వ్యాప్తిలో ఉన్న కరోనా (సార్స్‌-కొవ్‌-2) వేరియంట్లు ఈ ఔషధ నిరోధక సామర్థ్యాన్ని సముపార్జించుకుంటుండటమే ఇందుకు కారణం. పాక్స్‌లవిడ్‌లో నిర్మట్రెల్విర్‌ అనే ప్రొటియేజ్‌ ఇన్‌హిబిటర్‌ ఉంటుంది. సార్స్‌-కొవ్‌-2లోని ప్రధాన ప్రొటియేజ్‌లో చోటుచేసుకుంటున్న సాధారణ అమైనో ఆమ్ల సంబంధిత మార్పుల వల్ల నిర్మట్రెల్విర్‌ ప్రభావం గణనీయంగా తగ్గిపోతున్నట్లు అమెరికాలోని మిడ్‌వెస్ట్‌ యాంటీవైరల్‌ డ్రగ్‌ డిస్కవరీ సెంటర్‌ పరిశోధకులు గుర్తించారు. జపాన్‌లో ఇప్పటికే కరోనా చికిత్సలో వినియోగిస్తున్న ఎన్సిట్రెల్విర్‌ అనే ప్రొటియేజ్‌ ఇన్‌హిబిటర్‌ను అడ్డుకునేలా కూడా ఈ ఉత్పరివర్తనలు దోహదపడే అవకాశాలున్నాయని తేల్చారు. ఈ తరహా ఔషధ నిరోధకత పెరగకుండా ఉండాలంటే- ప్రస్తుతం హెచ్‌ఐవీ, హెపటైటిస్‌-సి వైరస్‌ బాధితులకు అందిస్తున్నట్లే కొవిడ్‌ రోగులకు బహుళ ఔషధ చికిత్సా విధానాన్ని అనుసరించడం మేలని వారు సూచించారు.


దిల్లీలో న్యూరోసర్జన్‌ను అరెస్టు చేసిన సీబీఐ

దిల్లీ: శస్త్రచికిత్స పరికరాలను ఓ నిర్దిష్ట దుకాణం నుంచి అధిక ధరలకు కొనుగోలు చేయాల్సిందిగా రోగులపై ఒత్తిడి తీసుకువస్తున్నారన్న అభియోగంతో దిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ ఆసుపత్రి న్యూరోసర్జన్‌ మనీశ్‌ రావత్‌తోపాటు ఆయన సహచరులు నలుగురిని సీబీఐ గురువారం అరెస్టు చేసింది. దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌లలోని పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించి ఈ అక్రమాల రాకెట్‌ను ఛేదించినట్లు అధికారులు తెలిపారు. మనీశ్‌ రావత్‌పాటు అరెస్టయినవారిలో దిల్లీలోని కనిష్క సర్జికల్‌ దుకాణం యజమాని దీపక్‌ ఖట్టర్‌, మధ్య దళారి అవ్నేశ్‌ పటేల్‌, మనీశ్‌శర్మ, కుల్దీప్‌ ఉన్నారు. ఆసుపత్రి నిబంధనలకు వ్యతిరేకంగా డాక్టర్‌ మనీశ్‌ రావత్‌ తన సహచరుల సాయంతో రోగుల నుంచి వైద్యపరీక్షలకు సైతం అదనపు వసూళ్లకు పాల్పడుతున్నట్లు వెల్లడైంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని