Nirmala Sitharaman: చిన్నారి మోములో చిరునవ్వు కోసం..

కేంద్ర ఆర్థిక మంత్రి, భాజపా సీనియర్‌ నేత నిర్మలా సీతారామన్‌పై కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్‌ ప్రశంసల జల్లు కురిపించారు.

Updated : 31 Mar 2023 07:27 IST

ఇంజెక్షన్‌కు రూ.7 లక్షల జీఎస్టీ  మినహాయింపు
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌పై శశి థరూర్‌ ప్రశంసలు

దిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి, భాజపా సీనియర్‌ నేత నిర్మలా సీతారామన్‌పై కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్‌ ప్రశంసల జల్లు కురిపించారు. అరుదైన క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ పాపకు అందించే ఖరీదైన ఇంజెక్షన్‌కు రూ.7 లక్షల జీఎస్టీని మినహాయించడం ద్వారా ఆమె మానవత్వం చాటుకున్నారని పేర్కొన్నారు. సంబంధిత వివరాలను తాజాగా ట్విటర్‌ వేదికగా థరూర్‌ పంచుకున్నారు. ‘‘కొన్ని రోజుల క్రితం యువ దంపతులిద్దరు నా వద్దకు వచ్చారు. వారి కుమార్తె నిహారిక అరుదైన క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు చెప్పారు. ఆమె చికిత్సలో వినియోగించే ఓ ఇంజెక్షన్‌ ఖరీదు రూ.65 లక్షలు. ఆ మొత్తాన్ని దాతల సాయంతో వారు సమకూర్చుకున్నారు. అయితే దిగుమతి చేసుకున్న ఆ ఇంజెక్షన్‌కు- అదనంగా రూ.7 లక్షల జీఎస్టీ భారం పడుతుందని దంపతులు వాపోయారు. అంతమొత్తాన్ని తాము భరించలేమంటూ.. నా సాయం కోరారు. ఈ విషయంపై నేను నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశాను. మానవతాసాయం కింద వారికి జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని కోరాను. తొలుత ఆమె నుంచి స్పందన రాలేదు. మళ్లీ లేఖ రాయగా.. అరగంటలో సమాధానం వచ్చింది. ఆమె కార్యదర్శి నాకు ఫోన్‌ చేశారు. సంబంధిత ఉన్నతాధికారులతో మంత్రి మాట్లాడినట్లు చెప్పారు. ఆ వెంటనే (ఈ నెల 28న) వారికి జీఎస్టీ మినహాయింపు లభించింది. ప్రభుత్వం, రాజకీయాలు, మానవత్వంపై నమ్మకాన్ని తన చర్య ద్వారా సీతారామన్‌ నిలిపి ఉంచారు’’ అని ఆయన వివరించారు. ఓ చిన్నారి మోములో చిరునవ్వు కోసం కేంద్ర ఆర్థిక శాఖ రూ.7 లక్షలు వదులుకుందంటూ కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయాల్లో కొనసాగేలా ఇలాంటి సంఘటనలు తనను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తుంటాయని థరూర్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని