స్థిరంగా నాలుగో చీతా కూన ఆరోగ్యం

మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్క్‌లో ఉన్న చివరి, నాలుగో చీతా కూన ఆరోగ్యం స్థిరంగానే ఉందని అధికారులు తెలిపారు.

Published : 27 May 2023 05:26 IST

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్క్‌లో ఉన్న చివరి, నాలుగో చీతా కూన ఆరోగ్యం స్థిరంగానే ఉందని అధికారులు తెలిపారు. ఇక్కడ మొత్తం నాలుగు కూనలు పుట్టగా, అందులో మూడు ఇప్పటికే చనిపోయిన సంగతి తెలిసిందే. దీంతో దేశంలో.. చీతాలను తిరిగి ప్రవేశపెట్టి, వాటి సంతతిని భారీగా పెంచేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమానికి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. గత ఏడాది సెప్టెంబరులో నమీబియా నుంచి భారత్‌కు చీతాలను తరలించిన సంగతి తెలిసిందే. అందులోని జ్వాల అనే చీతా ఈ ఏడాది మార్చి చివర్లో నాలుగు కూనలకు జన్మనిచ్చింది. అయితే ప్రస్తుతం కునో నేషనల్‌ పార్క్‌లో నెలకొన్న తీవ్రస్థాయి వేసవి తాపం కారణంగా మూడు పిల్లలు  మరణించాయని అధికారులు తెలిపారు. ఇక్కడ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌ కన్నా ఎక్కువగా ఉన్నాయని వివరించారు. నాలుగో చీతా పిల్ల ఆరోగ్యం ప్రస్తుతానికి స్థిరంగానే ఉన్నప్పటికీ అది బతుకుతుందా అన్నది చెప్పడం కష్టమన్నారు. దాని ప్రాణాలు కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని కునో పార్క్‌ డైరెక్టర్‌ ఉత్తమ్‌ శర్మ చెప్పారు. సాధారణంగా  నమీబియాలో చీతాలు వర్షాకాలం ఆరంభంలో కూనలకు జన్మనిస్తుంటాయి. ఆ తర్వాత శీతాకాలం వస్తుంది. జ్వాల మాత్రం వేసవి ప్రారంభంలో జన్మనిచ్చింది.

చీతా ప్రాజెక్టుపై అత్యున్నత స్థాయి కమిటీ

దిల్లీ: దేశంలో చీతా కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి 11 మంది సభ్యులతో అత్యున్నతస్థాయి స్టీరింగ్‌ కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ జీవులు ఉండే ప్రాంతంలో పర్యాటకానికి ప్రోత్సహించేందుకు సలహాలు కూడా ఇవ్వాలని కమిటీకి సూచించింది. మధ్యప్రదేశ్‌లోని కునో పార్క్‌లో మూడు చీతాలు చనిపోయిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కమిటీకి ‘గ్లోబల్‌ టైగర్‌ ఫోరమ్‌’ సెక్రటరీ జనరల్‌ రాజేశ్‌ గోపాల్‌ నేతృత్వం వహిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని