జంతర్‌మంతర్‌లో కుదరదు

భారత రెజ్లర్ల ఫెడరేషన్‌ మాజీ అధ్యక్షుడు, ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌కు వ్యతిరేకంగా ఆందోళన సాగిస్తున్న రెజ్లర్లను ఇకపై జంతర్‌ మంతర్‌ వద్దకు అనుమతించబోమని దిల్లీ పోలీసులు స్పష్టం చేశారు.

Published : 30 May 2023 05:28 IST

మరో ప్రదేశంలో దీక్ష చేసుకోండి
రెజ్లర్లకు దిల్లీ పోలీసుల స్పష్టీకరణ

దిల్లీ: భారత రెజ్లర్ల ఫెడరేషన్‌ మాజీ అధ్యక్షుడు, ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌కు వ్యతిరేకంగా ఆందోళన సాగిస్తున్న రెజ్లర్లను ఇకపై జంతర్‌ మంతర్‌ వద్దకు అనుమతించబోమని దిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. వారు నగరంలోని మరో అనువైన ప్రదేశాన్ని దీక్ష కోసం ఎంచుకోవాలని సూచించారు. ‘గత 38 రోజులుగా జంతర్‌ మంతర్‌ వద్ద దీక్ష చేసిన రెజ్లర్లకు మేం అన్ని సౌకర్యాలను కల్పించాం. కానీ ఆదివారం వారు చట్టాన్ని అతిక్రమించారు. మేం చెప్పినా వినిపించుకోలేదు. అందుకే అదుపులోకి తీసుకోవాల్సి వచ్చింది. రెజ్లర్లు దీక్షను కొనసాగించాలనుకుంటే అనుమతి కోరుతూ దరఖాస్తు చేయొచ్చు. అయితే జంతర్‌మంతర్‌ వద్ద దీక్షకు అనుమతినివ్వబోం. మరోచోట వారికి అనుమతి ఇస్తాం’ అని దిల్లీ డిప్యూటీ కమిషనర్‌ స్పష్టం చేశారు. ఆదివారం నాటి ఘటన తర్వాత జంతర్‌మంతర్‌ను పోలీసులు ఖాళీ చేయించారు. ప్రస్తుతం అక్కడ 144 సెక్షన్‌ విధించారు. ఆందోళనకారులు, ఇతరులను లోపలికి అనుమతించట్లేదు.

బ్రిజ్‌ భూషణ్‌కు వ్యతిరేకంగా ఆందోళన కొనసాగిస్తున్న రెజ్లర్లు.. ఆదివారం కొత్త పార్లమెంటు భవనం వద్దకు ర్యాలీగా వెళ్లేందుకు సిద్ధం కాగా వారిని పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్న విషయం విదితమే. అరెస్టైన వారిలో ముగ్గురు రెజ్లర్లు వినేశ్‌ ఫొగాట్‌, సాక్షి మలిక్‌, బజరంగ్‌ పునియాలతోపాటు 109 మంది ఆందోళనకారులు ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ఆదివారం దిల్లీవ్యాప్తంగా 700 మందిని అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. ఆ తర్వాత రెజ్లర్లను విడుదల చేశామని తెలిపారు. చట్టపరంగా రెజ్లర్లపై చర్యలు తీసుకుంటామని పోలీసుశాఖ ప్రతినిధి సోమవారం వెల్లడించారు.

మార్ఫింగ్‌ ఫొటోలు వైరల్‌..

అరెస్టైన రెజ్లర్ల ఫొటోలను కొందరు మార్ఫింగ్‌ చేయడంతో అవి సోషల్‌ మీడియాలో వైరలయ్యాయి. ఆ మార్ఫింగ్‌ ఫొటోల్లో వినేశ్‌ ఫొగాట్‌, సంగీత ఫొగాట్‌ పోలీసు వ్యాన్‌లో కూర్చుని నవ్వుతూ సెల్ఫీ తీసుకున్నట్లుగా ఉంది. దీనిపై సాక్షి మలిక్‌ స్పందిస్తూ.. ‘అవి నిజమైన ఫొటోలు కావు. కొందరు కావాలనే మార్ఫింగ్‌ చేశారు. అలాంటి వారికి సిగ్గు లేదు. మాకు చెడ్డపేరు తీసుకొచ్చేందుకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు’ అని మండిపడ్డారు.

రాజదండం ఒరిగిపోయింది: స్టాలిన్‌

రెజ్లర్లను అరెస్టు చేయడాన్ని పలువురు రాజకీయ నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన దురదృష్టకరమని తమిళనాడు సీఎం స్టాలిన్‌ మండిపడ్డారు. ‘రెజ్లర్లపై పోలీసులు ప్రవర్తించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నా. ఈ ఘటనతో పార్లమెంటులో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రతిష్ఠించిన రాజదండం (సెంగోల్‌) మొదటి రోజే ఒరిగిపోయినట్లుగా అనిపిస్తోంది’ అని ఆయన విమర్శించారు. బ్రిజ్‌భూషణ్‌లాంటి నిందితులకు భాజపా మద్దతివ్వడం ద్వారా నేరగాళ్లను ప్రోత్సహిస్తోందని కాంగ్రెస్‌ ఆరోపించింది. దిల్లీలో 16ఏళ్ల అమ్మాయిపై జరిగిన దాడే ఇందుకు నిదర్శనమని పేర్కొంది. రెజ్లర్లపై కేసులు పెట్టడాన్ని ఆ పార్టీ ఖండించింది. సోమవారం దిల్లీలో కాంగ్రెస్‌ నాయకురాలు అల్కా లాంబా మీడియాతో మాట్లాడారు. రెజ్లర్ల మార్ఫింగ్‌ ఫొటోలను మొదట తన సోషల్‌ మీడియా ఖాతాలో ఉంచిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆ తర్వాత తప్పు తెలుసుకుని వాటిని తొలగించారని చెప్పారు. రెజ్లర్లకు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌, బీఎస్‌పీ అధ్యక్షురాలు మాయావతి సంఘీభావం తెలిపారు.

* తదుపరి కార్యాచరణపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని రెజ్లర్లు సోమవారం వెల్లడించారు. తమను రాత్రి సమయంలో విడుదల చేశారని, అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

* రెజ్లర్లు తమ శిబిరంలో ఉన్నంతసేపూ పోలీసులు వారిని అడ్డుకోలేదని, పార్లమెంటుకు బయలుదేరినందునే అడ్డుకుని అరెస్టు చేశారని కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకుర్‌ తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రెజ్లర్లపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైందని, చట్ట ప్రకారం వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటారని అహ్మదాబాద్‌లో ఆయన చెప్పారు.


12 మందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు

అల్లర్లకు పాల్పడటం, ప్రభుత్వ అధికారుల విధులను అడ్డుకోవడం వంటి ఆరోపణలపై రెజ్లర్ల మీద దిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. సాక్షి మలిక్‌, వినేశ్‌ ఫొగాట్‌, బజరంగ్‌ పునియా సహా 12 మందిపై ఈ ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. జాతీయ ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవం సందర్భంగా రెజ్లర్లు వ్యవహరించారని, వారు బారికేడ్లను దాటేందుకు ప్రయత్నించే క్రమంలో జరిగిన తోపులాటలో 15 మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారని, అందులో ఎక్కువ మంది మహిళలే ఉన్నారని ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు. తమపై కేసు నమోదు చేయడాన్ని రెజ్లర్లు తీవ్రంగా ఖండించారు. బ్రిజ్‌భూషణ్‌ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదు చేస్తే ఆయనపై కేసు నమోదు చేసేందుకు దిల్లీ పోలీసులకు 7 రోజులు పట్టిందని, కానీ శాంతియుతంగా నిరసన చేస్తున్న తమపై ఏడు గంటల్లోనే కేసు పెట్టారని వినేశ్‌ ఫొగాట్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని