పాఠశాలలో మృతదేహాలు

బాలేశ్వర్‌ జిల్లాలోని బహనాగా వద్ద రైళ్లు ఢీకొన్న ఘటనలో వందలాదిమంది దుర్మరణం చెందారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఓడ్రాఫ్‌ బృందాలు కోచ్‌ల్లోని మృతదేహాలను సమీపంలోని ప్రాథమిక పాఠశాలకు తరలిస్తున్నాయి.

Published : 04 Jun 2023 03:21 IST

కటక్‌, భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: బాలేశ్వర్‌ జిల్లాలోని బహనాగా వద్ద రైళ్లు ఢీకొన్న ఘటనలో వందలాదిమంది దుర్మరణం చెందారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఓడ్రాఫ్‌ బృందాలు కోచ్‌ల్లోని మృతదేహాలను సమీపంలోని ప్రాథమిక పాఠశాలకు తరలిస్తున్నాయి. పోలీసు ఉన్నతాధికారులు పాఠశాల వద్ద ఉండి మృతదేహాలకు ఫొటోలు తీస్తున్నారు. ఎవరైనా గుర్తిస్తే వివరాలు తెలుసుకుని అప్పగిస్తున్నారు. కొన్ని మృతదేహాలకు తలలు లేకపోవడంతో గుర్తించడంలో సమస్యలు తలెత్తుతున్నాయని పోలీసులు చెప్పారు. మృతుల్లో పశ్చిమ్‌ బెంగాల్‌కు చెందిన వారి సంఖ్య ఎక్కువగా ఉందని తెలిపారు. బోగీల్లో ఇంకా కొన్ని మృతదేహాలు ఉన్నాయని.. వాటిని వెలికి తీసేందుకు చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.

భువనేశ్వర్‌ తరలిస్తాం: సీఎస్‌

ప్రమాదంలో 40 మృతదేహాలను మాత్రమే గుర్తించగలిగామని, వాటిని సమీప బంధువులకు అప్పగించామని ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) ప్రదీప్‌కుమార్‌ జెనా పేర్కొన్నారు. శనివారం రాత్రి భువనేశ్వర్‌లో ఆయన మాట్లాడుతూ.. మరో 160 మృతదేహాలను గుర్తించలేదని, వాటికోసం ఎవరూ సంప్రదించకపోవడంతో భువనేశ్వర్‌ తరలించాలని నిర్ణయించామని వెల్లడించారు. వాటిని నగరంలోని వివిధ ఆసుపత్రుల్లోని మార్చురీల్లో భద్రపరుస్తామని తెలిపారు. మరోవైపు తమిళనాడు సీఎం స్టాలిన్‌ సీఎస్‌ ప్రదీప్‌కుమార్‌ జెనాతో ఫోన్‌లో మాట్లాడారు. సహాయ కార్యక్రమాలకు తమ ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పారు.

క్షతగాత్రుల సమాచారానికి కంట్రోల్‌ రూమ్‌

ఈనాడు-అమరావతి: ఒడిశాలో రైళ్లు ఢీకొన్న ప్రమాద ఘటనలో కనిపించకుండా పోయిన ప్రయాణికులు, క్షతగాత్రుల సమాచారానికి ఏపీ అత్యవసర ఆపరేషన్‌ సెంటర్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ అంబేడ్కర్‌ తెలిపారు. 1070, 112, 18004250101 ఫోన్‌ నంబర్లలో సమాచారం తెలుసుకోవచ్చని వివరించారు. ఎవరైనా బంధువులు, స్నేహితులు కనిపించకపోతే 8333905022 వాట్సప్‌ నంబరుకు ప్రయాణికుని ఫొటో, ఇతర వివరాలు పంపాలని కోరారు. పోలీసు శాఖతో సమన్వయం     చేసుకుంటూ.. వివరాలు తెలియజేస్తామని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని