మృతుల్లో వలస కూలీలే అధికం

వారంతా వలస కూలీలు. ఉపాధి కోసం సొంత రాష్ట్రాలైన బిహార్‌, పశ్చిమ బెంగాల్‌, ఒడిశాల నుంచి చెన్నైకి వెళ్తున్నవారు కొందరైతే.. బెంగళూరులో చిన్నాచితక కూలీ పనులు చేసుకుంటూ కుటుంబ సభ్యులను చూసేందుకు స్వరాష్ట్రాలకు తిరిగివస్తున్న వారు మరికొందరు.

Published : 05 Jun 2023 04:17 IST

బాలేశ్వర్‌ నుంచి ఈనాడు ప్రత్యేక ప్రతినిధి, ఈనాడు, విశాఖపట్నం: వారంతా వలస కూలీలు. ఉపాధి కోసం సొంత రాష్ట్రాలైన బిహార్‌, పశ్చిమ బెంగాల్‌, ఒడిశాల నుంచి చెన్నైకి వెళ్తున్నవారు కొందరైతే.. బెంగళూరులో చిన్నాచితక కూలీ పనులు చేసుకుంటూ కుటుంబ సభ్యులను చూసేందుకు స్వరాష్ట్రాలకు తిరిగివస్తున్న వారు మరికొందరు. ఒడిశాలోని బహానగా వద్ద జరిగిన రైళ్ల ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన, క్షతగాత్రులుగా మిగిలిన వారిలో వలస జీవులే ఎక్కువగా ఉన్నారు. బెంగళూరు నుంచి యశ్వంత్‌పూర్‌ రైల్లో బయల్దేరిన వారు కొద్దిగంటల్లోనే ఇళ్లకు చేరుకోవాల్సి ఉండగా ప్రమాదం బారిన పడ్డారు. మరోపక్క బతుకుదెరువుకు ఎన్నో ఆశలతో కోరమాండల్‌ రైల్లో చెన్నైకి బయల్దేరిన పలువురు అక్కడికి చేరుకోకుండానే మార్గమధ్యలోనే ప్రాణాలొదిలారు. బాలేశ్వర్‌ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ‘ఈనాడు’ ప్రతినిధి పలకరించగా అత్యధికులు వలస కూలీలమని చెప్పారు. కళ్ల ముందే సహచరులను కోల్పోయామని, కొందరి కాళ్లూచేతులూ విరిగిపోయి కదల్లేని స్థితిలో అచేతనంగా పడి ఉన్నారంటూ రోదించారు. కాలికి గాయమైన దీపక్‌ అనే యువకుడితో మాట్లాడగా.. తనతో పాటు జనరల్‌ బోగీలో వంద మందికిపైగా ఉన్నారని, ప్రమాదంలో 30మందికి పైగా కళ్లెదుటే చనిపోయారని చెప్పాడు. వారిలో ఎక్కువ మంది తనతో పాటు బిహార్‌ నుంచి బయల్దేరిన కూలీలేనని తెలిపాడు.

జనరల్‌ బోగీల్లోనే ఎక్కువమంది

రిజర్వేషన్‌ ఛార్జీలు భరించే స్తోమత లేని కూలీలు ఎక్కువగా జనరల్‌ బోగీల్లోనే ప్రయాణించారు. కోరమాండల్‌ రైలుకు ఉన్న రెండు జనరల్‌ బోగీలు ప్రమాద సమయంలో కిక్కిరిసిపోయాయి. ప్రమాద తీవ్రతకు తునాతునకలవ్వటంతో వాటిలోని ప్రయాణికులే ఎక్కువగా చనిపోయారు. వీరి చిరునామాలు ఎక్కడా నమోదు కాకపోవడంతో ఆచూకీ కనుక్కోవడం కష్టమవుతోంది. కూలీలు ఇద్దరు, ముగ్గురు బృందాలుగా కలిసి ప్రయాణం సాగిస్తున్నారు. ఆ బృందాల్లో కొందరు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయాలతో బయటపడ్డారు. బయటపడ్డవారే కష్టపడి మృతుల కుటుంబాలకు సమాచారం చేరవేస్తున్నారు. ఘటనా స్థలిలో భవన నిర్మాణ కార్మికులు వాడే తాపీలు వంటి ఉపకరణాలు కనిపించాయి.


నిలువెల్లా గాయాలతో మిగిలాను
- బట్టన్‌ మండల్‌, బిహార్‌

కూలీ పనులకు మరికొందరితో కలిసి కోరమాండల్‌లో చెన్నై బయల్దేరాను. మేమంతా జనరల్‌ బోగీలో ఉన్నాం. మూడే మూడు సెకన్లలో ప్రమాదం జరిగింది. కళ్లు తెరిచి చూసేసరికి నా ఒళ్లంతా రక్తమోడుతోంది. స్థానికుల సాయంతో కష్టపడి బయటకు వచ్చా. నాతో పాటు బయల్దేరిన వారు ఏమయ్యారో, ఎక్కడున్నారో తెలియదు. నేనున్న బోగీలో చిక్కుకున్న వారిలో 8 మంది మాత్రమే బయటపడ్డాం. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేయడానికి ఇంకా 15 రోజులు పడుతుందంటున్నారు. ఉపాధి దేవుడెరుగు.. ఇప్పుడిలా ఒళ్లంతా గాయాలతో మిగిలాను.


అయినవాళ్లను చూద్దామని వచ్చి
- ఆజోది, బిహార్‌

నేను, నా మిత్రులు బెంగళూరులోని ఓ హోటల్‌లో పనిచేస్తాం. కుటుంబ సభ్యులను చూసేందుకు ముగ్గురం కలిసి బెంగళూరు నుంచి హావ్‌డాకు బయల్దేరాం. మరికొన్ని గంటల్లో మా గమ్యస్థానానికి చేరుకుంటామనే ఆనందంలో ఉండగా, ప్రమాదం జరిగింది. నేను పూర్తిగా స్పృహ కోల్పోయా. కళ్లు తెరిచి చూసే సరికి ఆసుపత్రిలో ఉన్నా. నా రెండు కాళ్లూ విరిగిపోయాయి. ఇకపై నడవలేను, కదల్లేను. నా ఇద్దరు మిత్రులు ఏమయ్యారో తెలీదు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు