కొత్తతరం వాహకనౌకపై పనిచేస్తున్నాం

కొత్తతరం వాహకనౌక ఎన్‌జీఎల్‌వీ (నెక్ట్స్‌ జనరేషన్‌ లాంచ్‌ వెహికల్‌) తయారీ దిశగా ఒక బృందం పనిచేస్తోందని ఇస్రో అధిపతి డా.సోమనాథ్‌ వెల్లడించారు.

Updated : 09 Jun 2023 06:11 IST

ఇస్రో అధిపతి డా.సోమనాథ్‌

శ్రీహరికోట, న్యూస్‌టుడే: కొత్తతరం వాహకనౌక ఎన్‌జీఎల్‌వీ (నెక్ట్స్‌ జనరేషన్‌ లాంచ్‌ వెహికల్‌) తయారీ దిశగా ఒక బృందం పనిచేస్తోందని ఇస్రో అధిపతి డా.సోమనాథ్‌ వెల్లడించారు. గురువారం బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బృంద సభ్యులు రాకెట్‌ ఎలా ఉండాలో వివరిస్తూ నివేదిక సమర్పించారని సోమనాథ్‌ తెలిపారు. సాంకేతిక ఇన్‌పుట్‌, అనుసరించాల్సిన విధానాలు, తయారీ తదితర అంశాలు అందులో వెల్లడించారన్నారు. బూస్టర్లను తిరిగి వినియోగించుకునేలా ఉండటంతో పాటు కొత్తతరం ప్రొపల్షన్‌ను వాహకనౌకలో ఉపయోగించాల్సి ఉంటుందన్నారు. పేలోడ్‌ను మెరుగుపరచాల్సి వస్తే క్రయోజనిక్‌ ప్రొపల్షన్‌ ఉండేలా చూస్తామన్నారు. స్వదేశీ పరిజ్ఞానాన్నే ఉపయోగిస్తామని, భాగస్వామ్య పరిశ్రమలను గుర్తించాల్సి ఉందన్నారు. కొత్త తరం రాకెట్‌ తయారీకి అయిదు నుంచి పదేళ్లు పడుతుందని సోమనాథ్‌ తెలిపారు. ఇస్రో వద్ద పూర్తి సాధనసంపత్తి ఉందని, నిధులు కేటాయిస్తే సరిపోతుందన్నారు. జులైలో చంద్రయాన్‌-3 ప్రయోగం, ఆగస్టులో గగన్‌యాన్‌ మొదటి అబార్ట్‌ మిషన్‌ నిర్వహిస్తామన్నారు. భారతదేశపు మొట్టమొదటి సోలార్‌ మిషన్‌ ఆదిత్య-ఎల్‌1 లాంచ్‌ విండోను కోల్పోవడంతో ప్రయోగం వచ్చే ఏడాదికి వాయిదా పడనుందని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని