విచారణ సమయంలో జడ్జీల వాగ్వాదం

కోర్టు హాలులో విచారణ జరుగుతున్న సమయంలోనే ధర్మాసనంలో కూర్చున్న ఇద్దరు న్యాయమూర్తులు గొడవపడ్డారు.

Updated : 26 Oct 2023 07:16 IST

తోటి న్యాయమూర్తిపై సీనియర్‌ ఆగ్రహం
గుజరాత్‌ హైకోర్టులో ఘటన
క్షమాపణ చెప్పడంతో సమసిన వివాదం

అహ్మదాబాద్‌: కోర్టు హాలులో విచారణ జరుగుతున్న సమయంలోనే ధర్మాసనంలో కూర్చున్న ఇద్దరు న్యాయమూర్తులు గొడవపడ్డారు. వాగ్వాదానికి దిగారు. జూనియర్‌ జడ్జీపై సీనియర్‌ న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేయడం, దస్త్రాలను విసురుగా వేయడం, ఆగ్రహంతో ధర్మాసనం నుంచి వెళ్లిపోవడం జరిగింది. ఆ తర్వాత రెండు రోజులకు ఆ సీనియర్‌ న్యాయమూర్తి తాను అలా ప్రవర్తించి ఉండాల్సింది కాదంటూ విచారం వ్యక్తం చేశారు. క్షమాపణ చెప్పారు. ఈ ఘటనలు గుజరాత్‌ హైకోర్టులో చోటుచేసుకున్నాయి. జడ్జీల మధ్య వాగ్వాద దృశ్యాలను హైకోర్టుకు చెందిన అధికారిక యూట్యూబ్‌ ఛానెల్‌ నుంచి తొలగించినప్పటికీ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి.  ఓ కేసుకు సంబంధించి సోమవారం ఉత్తర్వులు జారీ చేసే సమయంలో జస్టిస్‌ బిరేన్‌ వైష్ణవ్‌, జస్టిస్‌ మౌనా భట్ మధ్య విభేదాలు పొడచూపాయి. అసహనానికి గురైన సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ బిరేన్‌ వైష్ణవ్‌ తన చేతిలోని దస్త్రాన్ని విసిరేశారు. భిన్నాభిప్రాయం ఉంటే విడిగా తీర్పునివ్వాలని, నసుగుతూ మాట్లాడటం ఆపాలని జస్టిస్‌ మౌనా భట్‌తో అనడం వీడియోలో నమోదైంది. తామిద్దరం కలిసి కేసులు విచారణ జరిపేది లేదంటూ తన సీటు నుంచి వెళ్లిపోయారు. మంగళవారం దసరా పండగ కావడంతో కోర్టుకు సెలవు. బుధవారం ధర్మాసనంపై ఆసీనుడైన వెంటనే జస్టిస్‌ బిరేన్‌ వైష్ణవ్‌...సోమవారం నాటి తన ప్రవర్తనపై విచారం వ్యక్తం చేశారు. ఆ సమయంలో జస్టిస్‌ మౌనా భట్‌ కూడా అక్కడే ఉన్నారు. ప్రత్యక్ష ప్రసారమైన వీడియో దృశ్యాలను మాత్రం యూట్యూబ్‌ ఛానెల్‌ నుంచి హైకోర్టు తొలగించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని