కొలువుదీరిన యోగి సర్కారు 2.0

ఉత్తర్‌ప్రదేశ్‌లో సరికొత్త శకం మొదలైంది! ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్‌ వరుసగా రెండోసారి ప్రమాణం చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సహా భాజపాకు

Published : 26 Mar 2022 06:58 IST

యూపీ సీఎంగా రెండోసారి ఆదిత్యనాథ్‌ ప్రమాణం

52 మందికి దక్కిన మంత్రి పదవులు

ఈనాడు, లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లో సరికొత్త శకం మొదలైంది! ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్‌ వరుసగా రెండోసారి ప్రమాణం చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సహా భాజపాకు చెందిన పలువురు అతిరథ మహారథుల సమక్షంలో రాష్ట్రంలో యోగి సర్కారు 2.0 శుక్రవారం కొలువుదీరింది. 52 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైనప్పటికీ కమలదళం సీనియర్‌ నేత కేశవ్‌ప్రసాద్‌ మౌర్య డిప్యూటీ సీఎం పదవిని నిలబెట్టుకున్నారు. ఆయనతో పాటు మరో సీనియర్‌ నాయకుడు బ్రజేశ్‌ పాఠక్‌ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. లఖ్‌నవూలో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు కేంద్రమంత్రులు, భాజపా జాతీయాధ్యక్షుడు జె.పి.నడ్డా, భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బిహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌ ప్రముఖులు హాజరయ్యారు. సీఎం యోగితో పాటు 18 మంది కేబినెట్‌ మంత్రులు (వీరిలో ఇద్దరు డిప్యూటీ సీఎంలు), 14 మంది స్వతంత్ర హోదా మంత్రులు, 20 మంది సహాయ మంత్రులతో గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌ ప్రమాణం చేయించారు. సమయాన్ని ఆదా చేసేందుకు కొన్నిసార్లు నలుగురు ఒకేసారి ప్రమాణం చేయడమూ కనిపించింది. యోగి నేతృత్వంలోని గత కేబినెట్‌లో కేశవ్‌ప్రసాద్‌ మౌర్య, దినేశ్‌ శర్మ ఉప ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ఈ దఫా దినేశ్‌ స్థానాన్ని బ్రజేశ్‌ భర్తీ చేశారు. ఉత్తరాఖండ్‌ మాజీ గవర్నర్‌ బేబీరాణి మౌర్య, యూపీ భాజపా అధ్యక్షుడు స్వతంత్రదేవ్‌ సింగ్‌, మాజీ ఐఏఎస్‌ అధికారి ఎ.కె.శర్మ, కాంగ్రెస్‌ను వీడి భాజపాలో చేరిన జితిన్‌ ప్రసాద, అప్నాదళ్‌ (ఎస్‌) నేత అశిష్‌ పటేల్‌, నిషాద్‌ పార్టీ అధ్యక్షుడు సంజయ్‌ నిషాద్‌లకు కేబినెట్‌ బెర్తు దక్కింది. దానిష్‌ ఆజాద్‌ అన్సారీకి సహాయ మంత్రి పదవి దక్కింది. కొత్త కేబినెట్‌లో ఏకైక ముస్లిం ఆయనే. దానిష్‌ ప్రస్తుతానికి శాసనసభలోగానీ, మండలిలోగానీ సభ్యుడిగా లేరు. మాజీ ఐపీఎస్‌ అసీమ్‌ అరుణ్‌, కల్యాణ్‌సింగ్‌ మనవడు సందీప్‌ సింగ్‌ కూడా మంత్రి పదవులు (స్వతంత్ర హోదా) దక్కించుకున్నారు. యోగి సర్కారు 1.0 హయాంలో మంత్రులుగా పనిచేసినవారిలో పలువురు ప్రముఖులకు తాజాగా మొండిచేయి ఎదురైంది. వారిలో దినేశ్‌ శర్మతో పాటు సతీశ్‌ మహానా, రమాపతి శాస్త్రి, సిద్ధార్థ్‌నాథ్‌ సింగ్‌, శ్రీకాంత్‌ శర్మ తదితరులు ఉన్నారు.

మరువలేని మార్చి 25

2020 మార్చి 25న అయోధ్యలో శ్రీరాముడి కొలువును చిన్నపాటి టెంటు నుంచి మందిరానికి మార్చారు. రెండేళ్ల తర్వాత అదే రోజున యోగి సర్కారు 2.0 కొలువుదీరింది. దీంతో యూపీ చరిత్రలో ‘మార్చి 25’ మరువలేనిదని పలువురు చెబుతున్నారు.  రెండోసారి సీఎం పీఠమెక్కిన ఆదిత్యనాథ్‌కు ప్రధాని శుభాకాంక్షలు తెలియజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని