NEET: లోదుస్తులు విప్పించిన వివాదం.. ఆ అమ్మాయిలకు మళ్లీ నీట్‌ పరీక్ష..!

కేరళలో నీట్‌ పరీక్ష సమయంలో కొందరు అమ్మాయిలతో లోదుస్తులు విప్పించిన వివాదంలో జాతీయ పరీక్షల మండలి(నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ NTA)

Updated : 27 Aug 2022 16:46 IST

దిల్లీ: కేరళలో నీట్‌ పరీక్ష సమయంలో కొందరు అమ్మాయిలతో లోదుస్తులు విప్పించిన వివాదంలో జాతీయ పరీక్షల మండలి(నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ NTA) కీలక నిర్ణయం తీసుకుంది. ఆ అమ్మాయిలకు మరోసారి పరీక్ష రాసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. బాధిత అమ్మాయిలకు సెప్టెంబరు 4వ తేదీన నీట్‌ పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఇందుకు సంబంధించి ఆయా విద్యార్థినులకు ఈ-మెయిల్‌ ద్వారా సమాచారం చేరవేసినట్లు ఎన్‌టీఏ తెలిపింది.

ఈ ఏడాది జులై 17న నీట్‌ పరీక్ష సమయంలో తనిఖీల పేరుతో తమను లోదుస్తులు విప్పాలని సిబ్బంది బలవంతం చేసినట్లు కొందరు విద్యార్థినులు ఫిర్యాదు చేయడం అప్పట్లో పెను దుమారం రేపిన విషయం తెలిసిందే. కేరళలోని కొల్లం జిల్లా ఆయుర్‌లో గల మార్థోమా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో ఈ ఘటన చోటుచేసుకుంది. తనిఖీల సమయంలో లోదుస్తులకు ఉన్న హుక్స్‌ కారణంగా సౌండ్‌ వచ్చిందని దీంతో దాన్ని తీసేసి తన కుమార్తెను పరీక్షా కేంద్రంలోకి వెళ్లాలని సిబ్బంది ఆదేశించారని ఓ విద్యార్థిని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత పలువురు విద్యార్థినులు కూడా ఇదే తరహా ఫిర్యాదులు చేశారు. 

దీంతో ఈ ఘటన తీవ్ర వివాదానికి దారితీసింది. విద్యార్థినుల పట్ల అమర్యాదగా ప్రవర్తించిన కళాశాల సిబ్బందిపై చర్యలకు డిమాండ్‌ చేస్తూ విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. అయితే ఈ ఫిర్యాదులు దురుద్దేశంతో కూడినవని తొలుత బుకాయించిన ఎన్‌టీఏ.. ఆ తర్వాత ఘటనపై నిజ నిర్ధారణ కమిటీని నియమించింది. మరోవైపు ఈ కేసులో కేరళ పోలీసులు.. తనిఖీల్లో పాల్గొన్న ఐదుగురు మహిళలను అరెస్టు చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని