Oxygen Shortage Deaths: మరణాల సమాచారం అందించాలని రాష్ట్రాలను కోరిన కేంద్రం

కరోనా రెండో దశ సమయంలో ఆక్సిజన్‌ కొరతతో మృతిచెందినవారి సమాచారం అందించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్రం కోరింది. రాష్ట్రాలు అందించిన ఆ నివేదికను ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలు....

Published : 28 Jul 2021 00:06 IST

దిల్లీ: కరోనా రెండో దశ సమయంలో ఆక్సిజన్‌ కొరతతో మృతిచెందినవారి సమాచారం అందించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్రం కోరింది. రాష్ట్రాలు అందించిన ఆ నివేదికను ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలు ముగిసేలోపు పార్లమెంట్‌కు అందించనున్నట్లు తెలుస్తోంది. కరోనా రెండో దశ సమయంలో ఆక్సిజన్‌ కొరతతో కొవిడ్‌ బాధితులెవరూ ప్రాణాలు కోల్పోలేదని కొద్దిరోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో వెల్లడించింది. కాగా దీనిపై నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఈ చర్యలకు ఉపక్రమించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

కొవిడ్ సెకండ్‌ వేవ్‌లో ప్రాణవాయువు కొరతతో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదంటూ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు నివేదికలు సమర్పించినట్లు కేంద్ర ప్రభుత్వం ఈనెల 20న రాజ్యసభకు తెలిపింది. రెండో దశలో ప్రాణవాయువు లభించక రోడ్లపైనా, ఆసుపత్రుల్లోను కొవిడ్‌ బాధితులు భారీ సంఖ్యలో చనిపోయారా? లేదా? అన్న ప్రశ్నకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ, సహాయ మంత్రి భారతి ప్రవీణ్‌ పవార్‌ సమాధానమిచ్చారు. మరణాలు దాచిపెట్టాల్సిన అవసరమేమీ లేదని పేర్కొన్నారు.

కాగా ఈ ప్రకటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. కేంద్రంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. తప్పులు కప్పిపుచ్చుకునేందుకే భాజపా సర్కారు ఇలాంటి అబద్ధాలు చెబుతోందని దుయ్యబట్టాయి. ఆక్సిజన్‌ కొరతే లేకపోతే ఆసుపత్రులు ఎందుకు కోర్టులకు వెళ్తాయని విమర్శలు గుప్పించాయి. కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. ఆక్సిజన్‌ లేక బాధితులు మరణించలేదని, దానిని అందజేయడంలో కేంద్రం అనుసరించిన నిర్లక్ష్య ధోరణితోనే చాలా మంది ప్రాణాలు కోల్పోయారని ఆమె ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని