monkeypox: మంకీపాక్స్‌ టీకా అభివృద్ధికి టెండర్లు ఆహ్వానించిన కేంద్రం

దేశంలోనూ మంకీపాక్స్‌ (monkeypox) కేసులు వెలుగుచూస్తుండటంతో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంకీపాక్స్‌ కట్టడి చర్యల్లో భాగంగా ఈ వైరస్‌ను అడ్డుకునే టీకా (vaccine) అభివృద్ధికి టెండర్లను ఆహ్వానించింది. అనుభవం కలిగిన వ్యాక్సిన్‌ తయారీ......

Published : 27 Jul 2022 23:44 IST

దిల్లీ: దేశంలోనూ మంకీపాక్స్‌ (monkeypox) కేసులు వెలుగుచూస్తుండటంతో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంకీపాక్స్‌ కట్టడి చర్యల్లో భాగంగా ఈ వైరస్‌ను అడ్డుకునే టీకా (vaccine) అభివృద్ధికి టెండర్లను ఆహ్వానించింది. అనుభవం కలిగిన వ్యాక్సిన్‌ తయారీ సంస్థలు ఆగస్టు 10వ తేదీలోగా తమ ఆసక్తిని వ్యక్తీకరించాలని వెల్లడించింది. టీకాతోపాటు ఈ ఇన్‌ఫెక్షన్ నిర్ధారణ కోసం ఇన్-విట్రో డయాగ్నోస్టిక్ (IVD) కిట్ల తయారీలో అనుభవమున్న తయారీదారులూ తమ ఆసక్తిని తెలపాలని కోరింది.

మంకీపాక్స్‌ టీకాను ప్రజలకు అందుబాటులో ఉంచాలని భారత ప్రభుత్వం నిర్ణయించిందని.. అందుకోసం వ్యాధి నిర్ధారణ కిట్లు, నివారణ టీకాల అభివృద్ధికి టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు భారత వైద్య పరిశోధన మండలి (ICMR) ఓ ప్రకటనలో పేర్కొంది. పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంలో వీటిని అభివృద్ధి చేసే అవకాశం ఉందని తెలిపింది. 2019, 2022లో మంకీపాక్స్‌కు ఓ వ్యాక్సిన్‌తోపాటు నిర్దిష్ట చికిత్సను (టెకోవిరిమాట్) ఆమోదించబడినప్పటికీ.. అవి విస్తృతంగా అందుబాటులో లేవని ఐసీఎంఆర్‌ తెలిపింది.

పశ్చిమ ఆఫ్రికాలో మొదలైన మంకీపాక్స్‌ వైరస్‌ చాపకింద నీరులా ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్‌ కేసులు 78 దేశాల్లో వెలుగుచూడగా.. 18వేల మందికి సోకింది. ఈ నేపథ్యంలోనే అప్రమత్తమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) జులై 23న దీన్ని గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీగా ప్రకటించింది. భారత్‌లో ఇప్పటివరకు 4కేసులు బయటపడినట్లు అధికారిక గణాంకాలు పేర్కొంటున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని