ఎయిర్‌ అంబులెన్సులో జపాన్‌ నుంచి గుజరాత్‌కు!

ఉపాధి కోసం జపాన్‌ వెళ్లి అక్కడే టీబీ బారిన పడి.. బ్రెయిన్‌ స్ట్రోక్‌తో ఎనిమిది నెలలుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భారతీయుడిని ఎట్టకేలకు స్వదేశం తీసుకొచ్చారు. నెటిజన్ల విరాళాలు, ప్రభుత్వ సహకారంతో అతడిని ఎయిర్‌ అంబులెన్స్‌ ద్వారా జపాన్‌ నుంచి గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఓ ప్రైవేటు

Updated : 21 Dec 2022 17:06 IST

అహ్మదాబాద్‌: ఉపాధి కోసం జపాన్‌ వెళ్లి అక్కడే టీబీ బారిన పడి.. బ్రెయిన్‌ స్ట్రోక్‌తో ఎనిమిది నెలలుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భారతీయుడిని ఎట్టకేలకు స్వదేశం తీసుకొచ్చారు. నెటిజన్ల విరాళాలు, ప్రభుత్వ సహకారంతో అతడిని ఎయిర్‌ అంబులెన్స్‌ ద్వారా జపాన్‌ నుంచి గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళ్తే..

గుజరాత్‌కు చెందిన జయేశ్‌ పటేల్‌(33) 2018లో భార్యతో కలిసి ఉపాధి నిమిత్తం జపాన్‌కు వెళ్లాడు. అతడి భార్య గర్భం దాల్చడంతో అదే ఏడాది తిరిగి స్వగ్రామానికి చేరుకుంది. ఆ తర్వాత జయేశ్‌ కూడా కొన్నాళ్లకు తిరిగి భారత్‌కు వద్దామనుకున్నా కరోనా, లాక్‌డౌన్‌తో రాలేకపోయాడు. ఈ క్రమంలో గతేడాది అక్టోబర్‌ నెలలో అతడికి టీబీ సోకింది. ఆ తర్వాత బ్రెయిన్‌ స్ట్రోక్‌ రావడంతో అక్కడి స్థానికులు జయేశ్‌ను ఒటా నగరంలోని షిబుకవా ఆస్పత్రిలో చేర్చారు. గత ఎనిమిది నెలలుగా జయేశ్ అక్కడే చికిత్స పొందుతున్నాడు. జయేశ్‌ ఆస్పత్రిపాలైన విషయం తెలిసి అతడి తండ్రి జపాన్‌కు వెళ్లారు. తన కుమారుడిని తిరిగి భారత్‌కు తీసుకొచ్చి చికిత్స కొనసాగించాలని భావించారు. కానీ, జయేశ్‌ను జపాన్‌ నుంచి భారత్‌కు తీసుకొచ్చేందుకు వారి ఆర్థిక స్థోమత సరిపోలేదు.

దీంతో జయేశ్‌ కుటుంబసభ్యులు, స్నేహితులు సోషల్‌మీడియాలో ‘ఐ సపోర్ట్‌ జయేశ్‌ పటేల్‌’ పేరుతో ఫండ్‌ రైజింగ్‌ ప్రారంభించారు. జయేశ్‌ను భారత్‌కు తీసుకొచ్చి, చికిత్స అందించడానికి రూ.1.2కోట్లు ఖర్చు అవుతుందని పేర్కొన్నారు. కాగా.. నెటిజన్లు స్పందించి తమ వంతు విరాళాలు ఇచ్చారు. అలా రూ. 41లక్షలు సమకూరడంతో జపాన్‌, భారత ప్రభుత్వాల నుంచి అనుమతి తీసుకొని జయేశ్‌ను సోమవారం ఒటా నుంచి ప్రత్యేక ఎయిర్‌ అంబులెన్సులో దిల్లీకి తరలించారు. అక్కడి నుంచి గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు తీసుకొచ్చి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. జపాన్‌ వైద్యుల సూచన మేరకు అహ్మదాబాద్‌ నుంచే ఒక వైద్య బృందం అక్కడికి వెళ్లి జయేశ్ ఆరోగ్య పరిస్థితిపై సమీక్షించింది. అనంతరం ఆ వైద్య బృందం ఆధ్వర్యంలోనే జయేశ్‌ను అహ్మదాబాద్‌ తీసుకొచ్చి ఆస్పత్రిలో చేర్చారు. జయేశ్‌ ఆరోగ్య పరిస్థితి చూసి అతడి కుటుంబసభ్యులు ఆందోళన పడుతున్నా తిరిగి తమ చెంతకు చేరడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా.. విరాళాలు ఇచ్చి జయేశ్‌ను తిరిగి భారత్‌కు తీసుకురావడంలో సహాయపడ్డ దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని