Haryana: మేకప్‌, నగలు వేసుకుని ఆసుపత్రికి రావొద్దు..!

ఆసుపత్రి సిబ్బందికి డ్రెస్‌కోడ్‌ తీసుకొచ్చింది హరియాణా (Haryana) ప్రభుత్వం. వైద్యులు, ఇతర సిబ్బంది ఇకపై రకరకాల నగలు, మేకప్‌, విచిత్రమైన హెయిర్‌స్టైల్‌ వంటివి వేసుకుని విధులకు రావొద్దని స్పష్టం చేసింది.

Updated : 11 Feb 2023 14:09 IST

చండీగఢ్‌: ఆసుపత్రుల్లో పనిచేసే సిబ్బందికి హరియాణా (Haryana) ప్రభుత్వం నూతన డ్రెస్‌ కోడ్‌ (Dress Code) విధానాన్ని తీసుకొచ్చింది. ఇకపై ఆసుపత్రి సిబ్బంది ఫంకీ హెయిర్‌స్టైల్‌, భారీ నగలు, మేకప్‌ వేసుకుని విధులకు రావడాన్ని అనుమతించబోమని స్పష్టం చేసింది. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే ఉద్యోగుల్లో క్రమశిక్షణ, ఏకత్వం, సమానత్వం ఉండాలనే ఉద్దేశంతోనే ఈ డ్రెస్‌ కోడ్‌ పాలసీని రూపొందించినట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రి అనిల్‌ విజ్‌ (Anil Viz) వెల్లడించారు.

‘‘అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ముఖ్యంగా ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే వైద్యులు, ఇతర సిబ్బంది పనివేళల్లో.. విచిత్రమైన హెయిర్‌స్టైళ్లు, భారీ నగలు, మేకప్‌, పొడవాటి గోళ్లు, స్కర్టులు ధరించడాన్ని అనుమతించబోం. పురుషులు అసాధారణ హెయిర్‌స్టైళ్లు, మోడర్న్‌ హెయిర్‌కట్‌ చేసుకుని రావొద్దు. గోళ్లు శుభ్రంగా ఉండాలి. టీషర్టులు, జీన్స్‌లు, స్కర్టులు, లెదర్‌ ప్యాంట్లు, క్రాప్‌టాప్‌లు వంటి దుస్తులు ప్రొఫెషనల్‌లా కన్పించవు. అందువల్ల వాటిని అనుమతించబోం. ప్రొఫెషనల్‌గా కన్పించే ఫార్మల్‌ దుస్తులనే ధరించాలి. నర్సింగ్‌ క్యాడర్‌ మినహా ట్రైనీలు తప్పనిసరిగా నల్ల ప్యాంట్‌, తెల్ల షర్ట్‌ ధరించాలి’’ అని అనిల్‌ విజ్‌ తెలిపారు.

ఈ డ్రెస్‌కోడ్‌ (Dress Code)ను సిబ్బంది తప్పనిసరిగా పాటించాలని మంత్రి వెల్లడించారు. వారాంతాలు, నైట్‌ షిప్టుల్లోనే ఉన్న సిబ్బందికి కూడా వస్త్రధారణ విషయంలో ఎలాంటి మినహాయింపులు లేవన్నారు. ఈ నిబంధనలు ఉల్లంఘించినవారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని తెలిపారు. డ్రెస్‌ కోడ్‌ పాటించని ఉద్యోగిని ఆ రోజు గైర్హాజరిగా పరిగణిస్తామని మంత్రి పేర్కొన్నారు. ‘‘ప్రైవేటు ఆసుప్రతుల్లో పనిచేసే వైద్యులు, సిబ్బందికి తప్పనిసరిగా డ్రెస్‌కోడ్‌ ఉంటుంది. కానీ, ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తే.. రోగి ఎవరో, డాక్టర్‌ ఎవరో తెలుసుకోవడం చాలా కష్టం. అందుకే ఈ డ్రెస్‌ కోడ్‌ తీసుకొచ్చాం’’ అని అనిల్‌ విజ్‌ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని