Corona: దిల్లీలో పెరుగుతున్న వైరస్‌ కేసులు.. నిపుణులను ఆశ్రయిస్తామన్న ఉప ముఖ్యమంత్రి

దేశ రాజధాని దిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కట్టడికి నిపుణుల సలహా తీసుకుంటామని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా పేర్కొన్నారు.......

Published : 20 Apr 2022 01:12 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో కరోనా వైరస్‌ ప్రాబల్యం క్రమంగా పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. గడిచిన రెండు వారాల్లో భారీగా కేసులు నమోదయ్యాయి. గత 15 రోజుల్లో దిల్లీ పరిసర ప్రాంత వాసుల్లో కొవిడ్‌ వ్యాప్తి 500శాతం పెరిగినట్లు ‘లోకల్‌ సర్కిల్‌’ సర్వేలో వెల్లడైంది. కేసుల పెరుగుదల నేపథ్యంలో ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా స్పందించారు. కరోనా వైరస్‌ పూర్తిగా తొలగిపోయే అవకాశం లేదని.. వైరస్‌తో కలిసి జీవించడం తప్పదన్నారు. దిల్లీలో పెరుగుతున్న కేసుల కట్టడికి నిపుణుల సలహా తీసుకుంటామని తెలిపారు. ఇదిలా ఉంటే.. కేసుల పెరుగుదల వెనుక కొత్త వేరియంట్లు ఏమైనా ఉన్నాయా? అని ధ్రువీకరించుకునేందుకు పలు శాంపిళ్లను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కి పంపించారు. కొద్ది రోజుల్లో ఈ ఫలితాలు రానున్నాయి.

కొవిడ్‌ సోకినవారిలో అధికశాతం జ్వరం, దగ్గు, గొంతు నొప్పి లాంటి లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరుతున్నారని దిల్లీ వైద్యులు పేర్కొంటున్నారు. మాస్కులు ధరించకపోవడమే కేసుల పెరుగుదలకు అసలు కారణమన్నారు. చాలా మంది 3-5 రోజుల్లో కోలుకుంటున్నట్లు తెలిపారు. దిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రి సీనియర్ కన్సల్టెంట్ డా.రాజేష్ చావ్లా మాట్లాడుతూ.. ‘ఇది కొత్త వేవ్‌ అని అనుకోవడంలేదు. ప్రజలు మాస్కులు ధరించకపోవడం కారణంగానే కేసులు అధికమవుతున్నాయి. గత జనవరిలో వైరస్‌ విజృంభించిన సమయంలో ఎలాంటి లక్షణాలైతే ఉన్నాయో.. ప్రస్తుత బాధితుల్లోనూ అవే కనిపిస్తున్నాయి. 3-5 రోజుల్లో వైరస్‌ తగ్గుముఖం పడుతోంది’ అని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని