NEET PG exam: నీట్‌ పరీక్ష కేంద్రంలో కేంద్ర ఆరోగ్య మంత్రి సర్‌ప్రైజ్‌!

కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ(Mansukh Mandaviya) తొలిసారి నీట్‌ పీజీ పరీక్ష కేంద్రాన్ని సందర్శించి అందరినీ సర్‌ప్రైజ్‌ చేశారు. 

Updated : 05 Mar 2023 17:10 IST

చండీగఢ్‌: 2023-24 విద్యాసంవత్సరానికి వైద్య విద్యాసంస్థల్లో పోస్టు గ్రాడ్యుయేషన్‌(పీజీ) మెడికల్‌ సీట్ల భర్తీకి ఆదివారం దేశవ్యాప్తంగా నీట్‌ పీజీ పరీక్ష జరుగుతున్న విషయం తెలిసిందే. పంజాబ్‌లో ఉన్న కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ(Mansukh Mandaviya) అక్కడ ఓ పరీక్ష కేంద్రం వద్దకు వెళ్లి అందరినీ సర్‌ప్రైజ్‌ చేశారు. పటియాలాలో నీట్‌ పీజీ(NEET PG) పరీక్ష కేంద్రం వద్దకు అకస్మాత్తుగా వెళ్లిన ఆయన అక్కడి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం అభ్యర్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. మెడికల్‌ సైన్సెస్‌కు సంబంధించి నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌(NBEMS) పరీక్ష కేంద్రాన్ని ఇలా ఓ కేంద్రమంత్రి స్వయంగా సందర్శించడం ఇదే తొలిసారి అని ఆరోగ్య మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. 

మరోవైపు, ఈరోజు పటియాలాలోని నీట్‌ పరీక్ష కేంద్రాన్ని సందర్శించి అక్కడి భద్రతా ఏర్పాట్లను పరిశీలించినట్టు మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ట్విటర్‌లో వెల్లడించారు. పరీక్ష కేంద్రం వద్ద అభ్యర్థుల తల్లిదండ్రులతో మాట్లాడే అవకాశం వచ్చిందని పేర్కొన్నారు. అక్కడి ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తంచేసిన కేంద్రమంత్రి.. నీట్‌ పీజీ పరీక్ష రాస్తున్న అభ్యర్థులందరికీ ఆల్‌ ద బెస్ట్‌ చెప్పారు. అంతకముందు ఆయన పటియాలాలోని కాళీదేవి మందిర్‌, గురుద్వారాలో ప్రార్థనలు నిర్వహించారు. 

దేశవ్యాప్తంగా 277 నగరాల్లో 902 పరీక్ష కేంద్రాల్లో నీట్‌ పీజీ పరీక్ష నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు వైద్య విద్యాసంస్థల్లో ఎండీ, ఎంఎస్‌, పీజీ డిప్లొమా, డీఎన్‌బీ కోర్సులకు నిర్వహించే ఈ పరీక్షను మొత్తం 2,08,898 మంది రాస్తున్నారు. దీంతో ఈ పరీక్షల్లో ఎలాంటి అక్రమాలకు ఆస్కారం లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. జీరో-టాలరెన్స్ పాలసీలో భాగంగా బయోమెట్రిక్ వెరిఫికేషన్, సీసీటీవీలతో గట్టి నిఘా, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయడంతో పాటు మొబైల్‌ ఫోన్‌ జామర్లను కూడా వినియోగించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఎన్‌బీఈఎంఎస్‌ చీఫ్ అభిజాత్‌ సేథ్‌ అహ్మదాబాద్‌ కమాండ్‌ సెంటర్‌ నుంచి పరీక్షను పరిశీలిస్తున్నారు. అలాగే,  అభ్యర్థుల సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా ద్వారకాలో కూడా మరో కమాండ్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు