‘ఇద్దరు పిల్లలూ లేకుండా ఎవరికోసం బతకాలి?’ ఉగ్రదాడిలో బిడ్డల్ని కోల్పోయిన ఓ తల్లి ఆవేదన!

భర్త దూరమైనా వెరవకుండా ఆమె కొడుకులిద్దరినీ కష్టపడి చదివించి ప్రయోజకులను చేసింది. తర్వలోనే వారికి పెళ్లి చేయాలని భావించింది. కానీ, ఆమెకు ఆనందం ఎంతో కాలం నిలువలేదు.  

Published : 10 Jan 2023 01:23 IST

శ్రీనగర్‌: నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో భర్త దూరమయ్యాడు. దిక్కుతోచని స్థితి, కుటుంబ భారం ఓ వైపు, పిల్లలను ప్రయోజకులను చేయాలన్న బాధ్యత మరోవైపు. అంత కష్టంలోనూ బాధను దిగమింగుకుని ఎదుగుతున్న పిల్లలను చూసుకుని ఆ తల్లి మురిసిపోయింది. కాలంతోపాటు పిల్లలు పెరిగి పెద్దవారయ్యారు. ఇద్దరు పిల్లల్లో పెద్ద కొడుకు మరికొద్ది రోజుల్లో సైన్యంలో చేరి దేశ సేవ చేయనున్నాడనే వార్త ఆ తల్లి పడ్డ కష్టాలకు దక్కిన ప్రతిఫలంగా భావించింది. కానీ, ఆ సంతోషం ఆమెకు ఎంతో కాలం నిలువలేదు. ముష్కరుల రూపంలో మరోసారి విధి ఆమెను వెక్కిరించింది.

జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా ధంగ్రీ గ్రామంలో మైనార్టీ పౌరులపై జనవరి 1న ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఆమె ఇద్దరు కుమారులు మృతి చెందారు. క్షణకాలం ముందు వరకు కళ్ల ముందు కదలాడిన కొడుకులు ఒక్కసారిగా విగతజీవులుగా కనిపించే సరికి ఆ తల్లి బాధ వర్ణణాతీతం. ‘‘ ఇప్పుడు నేను ఒంటరిగా మిగిలిపోయాను. ఇకపై నేను ఎవరితో మాట్లాడాలి. ఉగ్రవాదులు నా ఆనందాన్ని లాగేసుకున్నారు. ఇక్కడితో నా ప్రపంచం ముగిసిపోయింది’’ అంటూ అంత్యక్రియల కోసం వచ్చిన బంధువులు, చుట్టుపక్కల వారితో ఆ తల్లి అంటున్న మాటలు అక్కడున్న ప్రతి ఒక్కరిని తీవ్ర ఆవేదనకు గురిచేస్తున్నాయి. 

జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా ధంగ్రీ గ్రామానికి చెందిన సరోజ్‌ బాలా అనే మహిళ ఆవేదన ఇది. జనవరి 1న భద్రతా దళాల నుంచి తప్పించుకునే క్రమంలో ఉగ్రవాదులు మూడు ఇళ్లపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సరోజ్‌ బాలా పెద్ద కుమారుడు దీపక్‌ శర్మ మృతి చెందాడు. మరునాడు ఉదయం ఉగ్రవాదులు వదిలేసిన ఐఈడీ బాంబు పేలి ఇద్దరు చిన్నారులు చనిపోగా, సరోజ్‌ బాలా చిన్న కొడుకు ప్రిన్స్‌ శర్మ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతణ్ని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశాడు. 

సరోజ్‌ బాలా పెద్ద కుమారుడు దీపక్ శర్మ భారత సైన్యంలో ఆర్ఢినెన్స్‌ విభాగంలో మరికొద్దిరోజుల్లో విధుల్లో చేరాల్సివుంది. చిన్న కుమారుడు ప్రిన్స్‌ శర్మ జమ్ము కశ్మీర్‌ జల్‌శక్తి శాఖలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఎదిగిన ఇద్దరు కుమారులు రోజుల వ్యవధిలో చనిపోవడంతో ఆ తల్లికి తీరని దుఃఖాన్ని మిగిల్చింది. త్వరలోనే కుమారులిద్దరికి పెళ్లి చేయాలని భావించిన సరోజ్‌బాలాను ఉగ్రదాడి రూపంలో విధి వెక్కిరించింది. 

సరిహద్దు జిల్లాలైన రాజౌరీ, పూంఛ్‌లలో ఉగ్రవాద కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అదనంగా మరో రెండువేల మంది సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందిని మోహరించనుంది.  20 కంపెనీలకు చెందిన రెండు వేల మంది సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందిని రెండు జిల్లాల్లోని సమస్యాత్మక ప్రాంతాలకు తరలిస్తున్నట్లు స్థానిక అధికారి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని