Himanta Biswa Sarma: ఖడ్గమృగాలపై టైటానిక్‌ హీరో పోస్టు.. నటుడిని ఆహ్వానించిన అస్సాం సీఎం

తమ రాష్ట్రాన్ని సందర్శించాలని ప్రముఖ హాలీవుడ్ నటుడు లియోనార్డో డికాప్రియో(Leonardo DiCaprio)కు అస్సాం(Assam ) ముఖ్యమంత్రి ఆహ్వానం పలికారు. అంతరించే దశలో ఉన్న ఒంటికొమ్ము ఖడ్గమృగాల గురించిన ఆలోచనే వీరి మధ్య సంభాషణకు దారితీసింది. 

Published : 10 Feb 2023 13:48 IST

గువహటి: టైటానిక్ స్టార్ లియోనార్డో డికాప్రియో(Leonardo DiCaprio)కు అస్సాం(Assam ) నుంచి ఆహ్వానం అందింది. తమ రాష్ట్రానికి రావాలని, కజిరంగా పార్క్‌ను సందర్శించాలని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ( Himanta Biswa Sarma) ఆహ్వానించారు. అయితే ఈ హాలీవుడ్‌ నటుడికి, హిమంతకు మధ్య సంభాషణకు కారణం ఒంటికొమ్ము ఖడ్గమృగాలు. ఇంతకీ విషయం ఏంటంటే..?

ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ సంబంధిత అంశాలపై డికాప్రియో తరచూ తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు. దాని పరిరక్షణకు తనవంతు సహకారం అందిస్తున్నారు. తాజాగా ఆయన అంతరించే దశలో ఉన్న ఒంటికొమ్ము ఖడ్గమృగాల గురించి ప్రస్తావించారు. వాటి పరిరక్షణ కోసం అస్సాం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కొనియాడారు. ‘2000 నుంచి 2021 మధ్యకాలంలో 190 ఖడ్గమృగాలను చంపివేశారు. కొమ్ముల కోసం వీటిని హత్య చేశారు. కజిరంగా నేషనల్ పార్క్‌లో వాటిని వేటాడకుండా చూసేందుకు 2021లో అస్సాం ప్రభుత్వం చర్యలు తీసుకుంది’ అని సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టారు. 

ఈ క్రమంలో 2022లో ప్రభుత్వం ఆ లక్ష్యాన్ని చేరిందని, 1977 తర్వాత ఆ ప్రాంతంలో మొదటిసారి ఒక్క ఖడ్గమృగాన్ని కూడా వేటాడలేదని డికాప్రియో పేర్కొన్నారు. దీనిపై హిమంత(Himanta Biswa Sarma) స్పందించారు. నటుడి పోస్టును షేర్  చేస్తూ.. ‘వన్యప్రాణులను రక్షించుకోవడం మన సంస్కృతిలో అంతర్భాగం. మన వారసత్వాన్ని కొనసాగించేందుకు మేం అంకితభావంతో ఉన్నాం. మీ మాటలు సంతోషాన్నిచ్చాయి. అస్సాంను, ఇక్కడి కజిరంగా పార్క్‌ను సందర్శించాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం’ అని సీఎం ట్వీట్ చేశారు. 

ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు ప్రపంచంలోనే అత్యధికంగా అస్సాంలో ఉన్నాయి. చైనీయులు తమ సంప్రదాయ ఔషధాల తయారీలో ఖడ్గ మృగాల కొమ్ములను ఉపయోగిస్తుండగా, వియత్నాంలో ఈ కొమ్ము కలిగి ఉండటం ఒక హోదాగా భావిస్తారు. ఈ కొమ్ములపై మూఢనమ్మకాలు పెరగడంతో అంతర్జాతీయంగా వీటికి డిమాండ్ పెరిగింది. ఖడ్గమృగాల కొమ్ముల్లో ఔషధ గుణాలు ఉన్నాయనే అపోహలను తొలగించేందుకు.. గతంలో కజిరంగా పార్క్‌ సమీపంలో వేలాది కొమ్ములను దహనం చేశారు. ఇది హిమంత పర్యవేక్షణలోనే జరిగింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని