Meghalaya: చల్లారని ఉద్రిక్తతలు.. పెట్రోల్‌ కోసం కి.మీల మేర జనం బారులు

అస్సాం నుంచి మేఘాలయకు పెట్రో ఉత్పత్తులను రవాణా చేయబోమంటూ ది అస్సాం పెట్రోల్‌ మజ్దూర్‌ యూనియన్‌’ ప్రకటించింది. దీంతో మేఘాలయ వ్యాప్తంగా పెట్రోల్‌ బంకుల ఎదుట వాహనాలు బారులు తీరాయి.

Published : 25 Nov 2022 01:38 IST

షిల్లాంగ్‌: అస్సాం, మేఘాలయ రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలు చల్లారడం లేదు. మేఘాలయకు ఇంధనాన్ని సరఫరా చేయబోమంటూ ‘ది అస్సాం పెట్రోలియం మజ్దూర్‌ యూనియన్‌’ ప్రకటించడంతో అక్కడి వాహనదారులు ఒక్కసారిగా పెట్రోలు బంకులవైపు పరుగులు తీశారు. పెట్రోల్‌ కొరత ఏర్పడుతుందనే భయంతో ముందుగానే సరిపడా ఇంధనాన్ని నింపేందుకు పోటీ పడుతున్నారు. దీంతో బంకుల ఎదుట కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. వాహనదారులను అదుపు చేసేందుకు పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.

రెండు రాష్ట్రాల సరిహద్దులో మంగళవారం జరిగిన కాల్పుల్లో ఐదుగురు మేఘాలయ పౌరులతో సహా, అస్సాంకు చెందిన అటవీశాఖ అధికారి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో మేఘాలయ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. తమవారిని అక్రమంగా పొట్టన పెట్టుకున్నారంటూ అస్సాం నుంచి వస్తున్న ట్రక్కులు, లారీలపై మేఘాలయ వాసులు దాడులకు దిగారు. ఈ నేపథ్యంలో తమ వాహనాలకు ప్రమాదం పొంచి ఉందని పెట్రోలియం ఉత్పత్తులను సరఫరా చేసే ఐఓసీ, హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌ తదితర కంపెనీలకు ఏపీఎంయూ సమాచారం అందజేసింది. అస్సాం నుంచి మేఘాలయ వెళ్లే ట్యాంకర్లను నింపొద్దని కోరింది. దీనికి సంబంధించిన లేఖలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో మేఘాలయలోని వాహనదారులు బంకుల వద్ద బారులు తీరారు.

‘‘మేఘాలయలో చెలరేగిన ఆందోళనల్లో మా డ్రైవర్లు, క్లీనర్లు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కొందరు శాశ్వత అంగవైకల్యం పొందారు. ఇప్పటికీ దాడులు కొనసాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మేం ధైర్యం చేయలేం.’’అని ఏపీఎంయూ జనరల్ సెక్రెటరీ రామెన్‌దాస్‌ మీడియాకు తెలిపారు. పరిస్థితులు అదుపులోకి వచ్చేంత వరకు పెట్రోలియం ఉత్పత్తులను సరఫరా చేయబోమని అన్నారు. దీనిపై మేఘాలయ పెట్రోల్‌ పంప్‌ డీలర్స్‌ అసోసియేషన్ స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వం కలగజేసుకొని పరిస్థితిని చక్కదిద్దాలని కోరింది. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్‌కు తీవ్ర కొరత ఏర్పడుతుందని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని