18ఏళ్లు దాటిన వారందరికీ టీకా ఇవ్వండి

దేశంలో కరోనా ఉద్ధృతి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో..18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా వేయాలని భారత వైద్య మండలి(ఐఎంఏ) ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసింది.

Published : 06 Apr 2021 20:24 IST

ప్రధాని మోదీకి లేఖ రాసిన ఐఎంఏ

దిల్లీ: దేశంలో కరోనా ఉద్ధృతి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో..18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా వేయాలని భారత వైద్య మండలి(ఐఎంఏ) ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసింది. టీకాలు కొవిడ్ తీవ్రతను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని, హెర్డ్ ఇమ్యూనిటీకి దోహదం చేస్తాయంటూ ఆ లేఖలో టీకా అవసరాన్ని వెల్లడించింది. 

‘ప్రస్తుతం 45 ఏళ్లు పైబడిన వారికి కరోనా టీకాలు అందిస్తున్నాం. రెండో దశలో కరోనా వేగంగా విస్తరిస్తుండటంతో..టీకా కార్యక్రమాన్ని వేగవంతం చేయాలి. దాని కింద 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు అందించాలి. దగ్గర్లోని టీకా కేంద్రాల్లో ఉచితంగా టీకా అందించడంతో పాటు, ముందస్తు రిజిస్ట్రేషన్‌ లేకుండా వచ్చిన వారికి టీకా పంపిణీ చేయాలి’ అంటూ ఐఎంఏ ఆ లేఖలో కొన్ని సూచనలను ప్రధానికి విన్నవించింది. బహిరంగ ప్రదేశాల్లో సంచరించేందుకు, ప్రజా పంపిణీ వ్యవస్థ కింద సరుకులు తీసుకునే వారికి వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‌ను తప్పనిసరి చేయాలని పేర్కొంది. ‘కరోనా టీకా పంపిణీ వ్యక్తిగత రోగనిరోధక శక్తిని పెంచి, కేసుల సంఖ్యను పరిమితం చేస్తుంది. వ్యాధి తీవ్రతను తగ్గించి, హెర్డ్ ఇమ్యూనిటీని పెంచేందుకు టీకా ఒకటే మార్గం’ అని టీకాలు అందరికి అందుబాటులోకి రావాల్సిన అవసరాన్ని ప్రస్తావించింది. కరోనా వైరస్ ప్రసార గొలుసును విచ్ఛిన్నం చేసేందుకు పరిమిత కాలం నిరంతర లాక్‌డౌన్లను విధించాలని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని