జిన్‌పింగ్‌కు కాల్‌ చేసిన బైడెన్‌: ఏం చెప్పారంటే..!

జో బైడెన్‌, చైనా అధినేత షీ జిన్‌పింగ్‌తో  తొలిసారి ఫోన్‌లో సంభాషించారు.

Published : 12 Feb 2021 01:11 IST

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జో బైడెన్‌, చైనా అధినేత షీ జిన్‌పింగ్‌తో తొలిసారి ఫోన్‌లో సంభాషించారు. ఈ క్రమంలో ఆయన చైనా అనుసరిస్తున్న నిర్బంధ విధానాలు సరైనవి కావని తీవ్ర ఆందోళనను వ్యక్తం చేశారు. చైనా వ్యవహారాలపై ఓ కన్ను వేసేందుకు బైడెన్ ప్రభుత్వం ఇటీవల ఓ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు  పెంటగాన్‌ ఇటీవల ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇరుదేశాల నేతల ఫోన్‌ సంభాషణ కీలకంగా మారింది.

జనవరి 20న అమెరికా 46వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన జో బైడెన్‌.. తొలుత భారత్‌తో సహా మిత్రపక్షాలైన ఆస్ట్రేలియా, జపాన్‌, దక్షిణ కొరియా తదితర దేశ నేతలతో సంభాషించారు. ఆపై తాజాగా చైనా అధ్యక్షుడితో ఫోన్‌ సంప్రదింపులు జరపటం ప్రాధాన్యత సంతరించుకుంది. హాంగ్‌కాంగ్‌, తైవాన్‌లపై ఆంక్షలు, దాడులకు తెగబడటం, జిన్‌జియాంగ్‌లో మానవ హక్కుల ఉల్లంఘన, ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో కయ్యాలకు కాలుదువ్వటం వంటి అంశాలను ఈ సందర్భంగా బైడెన్‌ జిన్‌పింగ్‌తో ప్రస్తావించినట్టు శ్వేతసౌధం ఓ ప్రకటనలో వెల్లడించింది.

చైనీయుల నూతన సంవత్సరం సందర్భంగా ఆ దేశ ప్రజలకు బైడెన్‌ శుభాకాంక్షలు తెలియచేశారు. అంతేకాకుండా కొవిడ్‌-19 మహమ్మారి కట్టడి, ప్రపంచ ఆరోగ్య భద్రత, వాతావరణ మార్పులు, ఆయుధ విస్తరణకు అడ్డుకట్ట వేయటం తదితర అంశాలు కూడా చర్చకు వచ్చాయి. తమ ప్రజల భద్రత, ప్రయోజనాలు, ఆరోగ్యం తదితర అంశాల్లో రాజీ పడేది లేదని.. అదేవిధంగా ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో స్వేచ్ఛ, అభివృద్ధిని నిలిపి ఉంచేందుకు కృషిచేస్తామని బైడెన్‌ సంభాషణలో స్పష్టం చేసినట్టు తెలిసింది. అమెరికా ప్రజలు, మిత్ర దేశాల క్షేమం కోసం బైడెన్‌ సత్ఫలితాలనిచ్చే ఆచరణాత్మక విధానాలను అనుసరించేందుకు కృతనిశ్చయంతో ఉన్నారని శ్వేతసౌధం ఓ ప్రకటనలో వెల్లడించింది.

ఇవీ చదవండి..

ట్రంప్‌నకు శాశ్వతంగా గుడ్‌బై చెప్పిన ట్విటర్‌

 స్వేచ్ఛనిచ్చాం.. చట్టాలు పాటించాల్సిందే: భారత్‌

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని