Early Warning Systems: ‘ముందస్తు హెచ్చరిక వ్యవస్థ’.. ఐదు దేశాలకు భారత్‌ సాంకేతిక సాయం

ప్రకృతి విపత్తుల సమయంలో ముందే ప్రజలను హెచ్చరించేలా ఓ వ్యవస్థను రూపొందించుకుంటున్న ఐదు దేశాలకు భారత్‌ సాయం చేస్తోందని ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మహాపాత్ర వెల్లడించారు.

Updated : 08 Apr 2024 16:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రకృతి విపత్తుల సమయంలో ముందే ప్రజలను హెచ్చరించేలా ఓ వ్యవస్థను రూపొందించుకుంటున్న ఐదు దేశాలకు భారత్‌ సాయం చేస్తోందని ‘భారత వాతావరణ విభాగం’ (ఐఎండీ) డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మహాపాత్ర (Mrutyunjay Mohapatra) వెల్లడించారు. పీటీఐ వార్తాసంస్థ ప్రతినిధులకు ఆయన ఈవిషయాన్ని తెలిపారు. ‘ముందస్తు హెచ్చరిక వ్యవస్థ’ను తయారుచేసుకుంటున్న నేపాల్‌, మాల్దీవులు, శ్రీలంక, బంగ్లాదేశ్‌, మారిషస్‌లకు భారత్‌ సాంకేతిక సాయం అందిస్తోందని వెల్లడించారు. 

ఐరాస హెచ్చరిక 

ప్రకృతి విపత్తుల ప్రభావం నుంచి ఈ దేశాలను రక్షించడానికి జరుగుతున్న ప్రయత్నాల్లో భారత్‌ పెద్దన్న పాత్ర పోషిస్తోంది. ప్రమాదకర వాతావరణం, నీరు, వాతావరణ విపత్తుల నుంచి రక్షణ కోసం 2027 నాటికి ‘ముందస్తు హెచ్చరికల వ్యవస్థ’లను రూపొందించుకోవాలని ఐక్యరాజ్యసమితి 2022లో ప్రకటించింది. ‘ఎర్లీ వార్నింగ్స్‌ ఫర్‌ ఆల్‌’ ప్రక్రియలో భాగంగా చొరవ తీసుకున్న భారత్‌ ఆ దిశగా గట్టి కసరత్తు చేస్తోంది. 

‘‘50 శాతం దేశాల్లో ముందస్తు హెచ్చరిక వ్యవస్థ లేదు. దీని కారణంగా పేద దేశాలు, అభివృద్ధి చెందని దేశాలు, ద్వీప దేశాలు ఆస్తి, ప్రాణ నష్టాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ దేశాలకు ఆర్థిక, సాంకేతిక మద్దతు అవసరం. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యవస్థ అవసరమున్న 30 దేశాల్లో ఐదింటికి భారత్‌ సహకారం అందిస్తోంది. ఆయా దేశాల్లో వాతావరణ పరిశీలనా కేంద్రాల ఏర్పాటుకు సాయం చేస్తాం. ఐఎండీ అంచనాలు, డేటా మార్పిడి, హెచ్చరిక వ్యాప్తి కోసం సంబంధిత దేశాల మంత్రిత్వ శాఖలతో కలసి పనిచేస్తున్నాం’’ అని మృత్యుంజయ్‌ పేర్కొన్నారు. 

ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) డిసెంబరులో విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 52 శాతం దేశాలు (101 దేశాలు) బహుళ ప్రమాదకర ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను కలిగిఉన్నాయి. 1970 నుంచి 2021 వరకు దాదాపు 12 వేల ప్రకృతి విపత్తులు సంభవించాయి. దీని ఫలితంగా రెండు మిలియన్లకు పైగా మరణాలు 4.3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక నష్టం వాటిల్లింది. 2015 నుంచి 2022 మధ్య 41 వేల మంది విపత్తు కారణంగా మరణించినట్లు నివేదిక పేర్కొంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని