Covid-19: కరోనా మరణాల కలవరం.. 24 గంటల వ్యవధిలో 12 మంది మృతి

దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 761 కరోనా కేసులు నమోదు కాగా.. 12 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Updated : 05 Jan 2024 16:53 IST

దిల్లీ: దేశంలో కరోనా (Covid-19) మరణాలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 12 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ బులెటిన్‌ (Union health ministry) విడుదల చేసింది. దేశవ్యాప్తంగా కొత్తగా 761 కొవిడ్‌-19 కేసులు నమోదైనట్లు కేంద్రం పేర్కొంది. అయితే, యాక్టివ్‌ కేసుల సంఖ్య 4,423 నుంచి 4,334కి తగ్గినట్లు తెలిపింది. కేరళలో 1,249 క్రియాశీల కేసులు ఉండగా.. కర్ణాటకలో 1,240, మహారాష్ట్రలో 914, తమిళనాడులో 190, ఛత్తీస్‌గఢ్‌, ఆంధ్రప్రదేశ్‌లో 128 చొప్పున ఉన్నాయి. తాజాగా కేరళలో ఐదుగురు, కర్ణాటకలో నలుగురు, మహారాష్ట్రలో ఇద్దరు, ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒకరు ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్రం వెల్లడించింది.

ఏపీలో 30 జేఎన్‌.1 కేసులు

మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా (Coronavirus) కొత్త వేరియంట్‌ జేఎన్‌.1 కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. జనవరి 4 నాటికి 12 రాష్ట్రాల్లో 619 కేసులు నమోదైనట్లు అధికారిక వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. ఒక్క కర్ణాటకలోనే అత్యధికంగా 119 కేసులు నమోదు కాగా.. కేరళలో 148; మహారాష్ట్రలో 110; గోవా 47; గుజరాత్‌ 36; ఆంధ్రప్రదేశ్‌ 30; తమిళనాడు 26; దిల్లీ 15; రాజస్థాన్‌ 4; తెలంగాణ 2; ఒడిశా, హరియాణాలలో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి. 

కొవిడ్‌ ఉపరకం జె.ఎన్‌.1 వెలుగు చూసిన తర్వాత డిసెంబర్‌ 5 నుంచి దేశవ్యాప్తంగా రెండంకెల సంఖ్యలోనే కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ మధ్య కాలంలో చలితీవ్రత పెరగడంతో కొవిడ్‌ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఇటీవల కరోనా కారణంగా ఒకరిద్దరు మాత్రమే మృతి చెందగా, తాజాగా 24 గంటల వ్యవధిలోనే 12 మంది ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని