Published : 27 Mar 2022 13:39 IST

International Flights: రెండేళ్ల విరామం తర్వాత.. అంతర్జాతీయ విమాన సర్వీసులు షురూ..!

ఆంక్షలు సడలించిన కేంద్ర పౌరవిమానయాన శాఖ

దిల్లీ: యావత్‌ ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా అంతర్జాతీయ విమానాలపై ఆంక్షలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే, ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ అదుపులోనే ఉండడం, వ్యాక్సిన్‌ విస్తృతంగా అందుబాటులోకి రావడంతో అంతర్జాతీయ విమాన సర్వీసులపై భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్‌ కన్నా ముందు మాదిరిగానే అన్ని సర్వీసులు యథావిధిగా నడిచే విధంగా ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు పేర్కొంది. ఈ ఆంక్షల సడలింపు ఆదివారం నుంచే అమలులోకి వచ్చిందని వెల్లడించింది. దీంతో గత రెండేళ్లుగా బ్రేక్‌ పడిన అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు తిరిగి రెక్కలు వచ్చినట్లు అయ్యింది.

ఇక విమానాశ్రయాలు, విమానాల్లో ఇంతకుముందు విధించిన కొవిడ్‌ నిబంధనలనూ పౌరవిమానయాన శాఖ సడలించింది. ముఖ్యంగా విమాన సిబ్బంది పీపీఈ కిట్లను ధరించాల్సిన అవసరం లేదు. కానీ, ఎయిర్‌పోర్టులు, విమానాల్లో మాస్కులు ధరించడం, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడం వంటివి తప్పనిసరి చేసింది. అంతేకాకుండా అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో అత్యవసర విభాగం కింద మూడు సీట్లను ఖాళీగా ఉంచాలని విమానయాన సంస్థలకు సూచించింది. వీటితోపాటు పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో మారిషస్‌, మలేషియా, థాయిలాండ్‌, టర్కీ, అమెరికా, ఇరాన్‌తోపాటు దాదాపు 40దేశాలకు చెందిన 60 విమానయాన సంస్థలు భారత్‌కు సర్వీసులు నడిపేందుకు మార్గం సుగమమైంది. దీనిపై వెంటనే స్పందించిన ఇండిగో ఎయిర్‌లైన్స్‌.. కువైట్‌, అబుదాబీ, షార్జా, జెడ్డా, రియాద్‌, దోహా, బ్యాంకాక్‌తోపాటు ఇతర దేశాల్లోని 150 రూట్లలో అంతర్జాతీయ సర్వీసులను త్వరలోనే పునఃప్రారంభిస్తామని ప్రకటించింది.

ఇదిలాఉంటే, ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ ఉద్ధృతి కారణంగా అంతర్జాతీయ విమానాలపై గత రెండేళ్లుగా ఆంక్షలు కొనసాగుతున్నాయి. అయితే, అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, సింగపూర్‌, యూఏఈ ఇలా.. సుమారు 28 దేశాలతో (Air Bubble) ఒప్పందం కుదుర్చుకున్న భారత ప్రభుత్వం.. ఆయా దేశాలకు ప్రత్యేక విమానాలను నడుపుతోంది. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తోన్న ప్రభుత్వం పూర్తిస్థాయి అంతర్జాతీయ విమానాలను గతేడాది ప్రారంభించాలని భావించినప్పటికీ.. ఒమిక్రాన్‌ కారణంగా ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. ప్రస్తుతం కేసులు తగ్గుముఖం పట్టడం, వివిధ దేశాల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నందున అంతర్జాతీయ విమాన సర్వీసులను యథావిధిగా తిరిగి ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts