
Covid Vaccination: 100కోట్ల డోసుల ఫీట్.. ఆరోజు ప్రత్యేక అనౌన్స్‌మెంట్లకు కేంద్రం ఏర్పాట్లు
దిల్లీ: అక్టోబరు 18 లేదా 19 నాటికి వంద కోట్ల డోసుల పంపిణీ ఫీట్‌ను చేరుకుంటామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ పునరుద్ఘాటించారు. ఆ మహత్తర సందర్భంలో భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గురువారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ.. 100 కోట్ల డోసులు పూర్తయినప్పుడు దేశవ్యాప్తంగా రైల్వే, మెట్రో స్టేషన్లు, విమానాశ్రయాలు, బస్టాండులు, ఓడరేవుల్లో ఈ మేరకు అనౌన్స్‌మెంట్ చేస్తామని తెలిపారు. ఈ సందర్భంలో ఆరోగ్య సిబ్బందికి సన్మాన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సమాచారం. కేంద్ర మంత్రులూ వేడుకల్లో భాగమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా 18 ఏళ్లు నిండినవారిలో 73 శాతం మంది కనీసం ఒక డోసు తీసుకున్నారని మంత్రి చెప్పారు. 30 శాతం మందికి రెండు డోసులూ పూర్తయ్యాయని తెలిపారు.
జమ్మూ కశ్మీర్‌లో 100 శాతం పూర్తి..
వ్యాక్సినేషన్ ప్రక్రియలో భారత్ దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. గురువారం నాటికి దేశవ్యాప్తంగా పంపిణీ చేసిన డోసుల సంఖ్య 97 కోట్లు దాటడం విశేషం. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ట్విటర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. కొవిడ్‌పై పోరాటంలో భారత్ మరో ఘనత సాధించినట్లు పేర్కొంది. మరోవైపు వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తయిన జాబితాలో తాజాగా జమ్మూ- కశ్మీర్ చేరింది. స్థానికంగా 20 జిల్లాల్లో 18 ఏళ్లు దాటిన వారందరికీ మొదటి డోసు పూర్తయిందని స్థానిక అధికార యంత్రాంగం గురువారం ప్రకటించింది. ‘దుర్బేధ్యమైన ప్రాంతాలకూ చేరుకుని మా సిబ్బంది టీకాలు వేశారు. ఈ క్రమంలో రేయింబవళ్లు పని చేశారు. స్థానికులను చైతన్యపరిచారు’ అని కశ్మీర్ ఆరోగ్య, వైద్య విద్య అదనపు చీఫ్ సెక్రెటరీ వివేక్ భరద్వాజ్ వివరించారు. ఇప్పటివరకు 1.4 కోట్ల డోసులు ఇచ్చినట్లు వెల్లడించారు.
ఇవీ చదవండి
ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు/ సేవల గురించి ఈనాడు సంస్థకి ఎటువంటి అవగాహనా ఉండదు. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి, జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు/ సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు.