Modi: భారతీయ విలువలే 9/11 వంటి దాడులకు పరిష్కారం: మోదీ

9/11 దాడిని మానవత్వంపై జరిగిన దాడిగా మోదీ అభివర్ణించారు. మనుషుల్లో మానవతా విలువల్ని పెంపొందించడం ద్వారానే ఇలాంటి మారణహోమాల్ని అరికట్టగలమని అభిప్రాయపడ్డారు...

Published : 11 Sep 2021 14:05 IST

అహ్మదాబాద్‌: అమెరికాలోని ప్రపంచ వాణిజ్య సంస్థ భవంతులపై ఉగ్రదాడి జరిగి 20 ఏళ్లు అయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. 9/11 ఘటనను మానవత్వంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. మనుషుల్లో మానవతా విలువల్ని పెంపొందించడం ద్వారానే ఇలాంటి మారణహోమాల్ని అరికట్టగలమని అభిప్రాయపడ్డారు. అహ్మదాబాద్‌లో నూతనంగా నిర్మించిన సర్దార్‌ధామ్‌ భవన్‌ను శనివారం ప్రారంభిస్తూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా సెప్టెంబరు 11వ తేదీకి ఉన్న ప్రాముఖ్యతను గుర్తుచేశారు.

అలాగే కొన్నేళ్ల క్రితం ఇదే రోజున స్వామి వివేకానంద షికాగోలో ప్రసంగించినట్లు గుర్తు చేశారు. ఈ ప్రసంగం ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. ఈ రోజున భారతీయ సంప్రదాయంలోని మానవతా విలువలను వివేకానందుడు ప్రపంచానికి పరిచయం చేశారన్నారు. ఆ విలువలే 9/11 వంటి దాడులకు పరిష్కారం చూపగలవన్నారు. ఈ విషయాన్ని యావత్ ప్రపంచం క్రమంగా గుర్తిస్తోందన్నారు. 

అలాగే తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి 100వ వర్థంతి నేపథ్యంలో బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయంలో ఆయన పేరిట తమిళ భాషాధ్యయనంపై పీఠం ఏర్పాటు చేస్తామని మోదీ ఈ సందర్భంగా  ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని