కరోనా కాలం: నిబంధన ఉల్లంఘించి.. రాజీనామా

కొన్నిసార్లు అనుకోకుండానో.. తప్పని పరిస్థితుల్లోనో నిబంధనలు ఉల్లంఘిస్తుంటారు. అలాంటి వారిలో చేసిన తప్పుపై స్పందించేవాళ్లు చాలా అరుదనే చెప్పాలి. కానీ  ఐర్లాండ్‌కు చెందిన పర్యాటక శాఖ ప్రధానాధికారి తాను చేసిన ఓ పొరపాటుకు

Published : 19 Aug 2020 01:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొన్నిసార్లు అనుకోకుండానో.. తప్పని పరిస్థితుల్లోనో నిబంధనలు ఉల్లంఘిస్తుంటారు. అలాంటి వారిలో చేసిన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసేవాళ్లే తప్ప.. తప్పును నిజాయితీగా ఒప్పుకొని బాధ్యత వహించేవాళ్లు చాలా అరుదు. అలా నిజాయితీ కలిగిన ఐర్లాండ్‌కు చెందిన ఓ ప్రభుత్వ ఉన్నతద్యోగి తాను చేసిన తప్పునకు ఏకంగా తన పదవికి రాజీనామా చేశాడు. తప్పక చేసినా.. తప్పు తప్పే కాబట్టి తన బాధ్యతగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు.

ప్రస్తుతం కరోనా వైరస్‌ ప్రపంచదేశాలను వణికిస్తోంది. దీంతో అన్ని దేశాల్లో ప్రభుత్వాలు ప్రజల్ని ఇంట్లోనే ఉండమని, పర్యటనల కోసం విదేశాలకు వెళ్లొద్దని సూచిస్తున్నాయి. అలాగే ఐర్లాండ్‌ ప్రభుత్వం కూడా ప్రజలను విదేశీ పర్యటనలు చేయవద్దంటూ పలు నిబంధనలు పెట్టింది. కానీ సాక్షాత్తూ పర్యాటక శాఖ ఛైర్మన్‌ అయిన మైఖేల్‌ కావ్లీ ఆ నిబంధనను ఉల్లంఘించారు. ఆయన తన కుటుంబంతో కలిసి విహారయాత్ర నిమిత్తం ఇటలీ వెళ్లారు. ఈ వార్త మీడియాలో సంచలనం కావడంతో వెంటనే మైఖేల్‌ కావ్లీ స్పందించారు. ప్రభుత్వంలో ఉన్నత పదవిలో ఉండి.. ప్రభుత్వం విధించిన నిబంధనను ఉల్లంఘించినందుకు గాను మైఖేల్‌.. తన పదవీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విహారయాత్ర కోసం చాలా కాలం ముందే ప్రణాళిక వేసుకున్నామని, అందుకే వెళ్లాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. అయినా తను చేసింది తప్పే కాబట్టి.. తన రాజీనామా లేఖను ఐర్లాండ్‌ పర్యాటక శాఖ మంత్రికి పంపినట్లు తెలిపారు. తాను చేసిన పని ప్రభుత్వానికి ఇబ్బంది తెచ్చిపెట్టకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని