Herd Immunity: ఒమిక్రాన్‌.. హెర్డ్‌ ఇమ్యూనిటీకి దారితీస్తుందా..?

కొవిడ్‌ను ఎదుర్కొనే హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధించేందుకు ఒమిక్రాన్‌ వేరియంట్‌ దోహదపడుతుందా అనే ప్రశ్నలకు నిపుణులు పలు కోణాలను ప్రస్తావిస్తున్నారు.

Published : 24 Feb 2022 01:31 IST

శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే

వాషింగ్టన్‌: అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోన్న ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా స్పష్టంగా కనిపిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రతి దేశంలో దాదాపు మెజారిటీ ప్రజలు ఈ వేరియంట్‌ బారిన పడినట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే, వ్యాప్తి ఎక్కువగా ఉన్నప్పటికీ ఒమిక్రాన్‌ తీవ్రత మాత్రం తక్కువేనని ఇప్పటివరకు వచ్చిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొవిడ్‌ను ఎదుర్కొనే హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధించేందుకు ఒమిక్రాన్‌ వేరియంట్‌ దోహదపడుతుందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే వైద్యరంగ నిపుణులు మాత్రం హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధించకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయంటూ పలు కోణాలను ప్రస్తావిస్తున్నారు.

‘హెర్డ్‌ ఇమ్యూనిటీ అనేది ఓ అంతుచిక్కని భావన. ఇది కరోనా వైరస్‌కు వర్తించదు’ అని యూనివర్సిటీ ఆఫ్‌ మేరీల్యాండ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌కు చెందిన డాక్టర్‌ డాన్‌ మిల్టన్‌ పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ లేదా ఇదివరకు వైరస్‌ సోకని వారికి ఈ సూక్ష్మక్రిమి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు జనాభాలో అత్యధిక శాతం మందికి రోగనిరోధకత కలిగి ఉన్నప్పుడు మాత్రమే హెర్డ్‌ ఇమ్యూనిటీగా చెబుతామన్నారు. ప్రస్తుతం వ్యాక్సిన్‌ తీసుకున్న వారికి కూడా వైరస్‌ సోకే అవకాశం ఉందన్న ఆయన.. మిజిల్స్‌పై హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధించాలంటే 95శాతం పౌరులకు రోగనిరోధకత అవసరమైన విషయాన్ని గుర్తుచేశారు.

భిన్న కారణాలు..

‘కరోనాపై హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధిస్తామని ఇంతవరకూ పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. ఇందుకు పలు కారణాలు ఉన్నాయి. ఒకటి.. వ్యాక్సిన్‌ వల్ల లేదా కొవిడ్‌ నుంచి కోలుకోవడం వల్ల వృద్ధి చెందే యాంటీబాడీలు కొంతకాలానికే క్షీణించిపోవడం. తీవ్ర జబ్బు నుంచి వ్యాక్సిన్‌లు రక్షిస్తున్నప్పటికీ మరోసారి వైరస్‌ బారినపడే అవకాశం ఉండడం. వీటితోపాటు పేద దేశాలు ఇంకా వ్యాక్సిన్‌కు నోచుకోకపోవడం, ధనిక దేశాల్లో చాలా మంది వ్యాక్సిన్‌లను వ్యతిరేకించడం, చాలా ప్రాంతాల్లో చిన్నారులకు ఇంకా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాకపోవడం వంటి కారణాలు’ హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధించకపోవడానికి కారణాలుగా డాక్టర్‌ మిల్టన్‌ పేర్కొన్నారు.

అయినప్పటికీ రక్షణే..

‘వైరస్‌ వ్యాప్తిలో ఉన్నంతకాలం ఉత్పరివర్తనాలకు గురౌతూనే ఉంటుంది. ఇలా వైరస్‌ మనుగడ సాగించడంతో కొత్త వేరియంట్లు పుట్టుకొస్తాయ్‌. ఒమిక్రాన్‌ వంటి మ్యుటేషన్‌ చెందిన వేరియంట్లు వ్యాక్సిన్‌ల సామర్థ్యానికి సవాలు విసురుతూనే ఉంటాయి. అయినప్పటికీ ఇన్‌ఫెక్షన్‌లు కొనసాగుతున్న ప్రాంతంలో అక్కడి ప్రజలు హెర్డ్‌ ఇమ్యూనిటీ వైపు ముందుకు వెళుతారు. భవిష్యత్తులో సంభవించే వైరస్‌ విజృంభణల నుంచి ప్రజలకు పూర్తి రక్షణ ఉంది’ అని డాక్టర్‌ మిల్టన్‌ పేర్కొన్నారు. అయితే, హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధించే విషయాన్ని పక్కనబెడితే.. కొవిడ్‌-19 మహమ్మారి భారీ వేవ్‌ల రూపంలో కాకుండా సాధారణ ఫ్లూ లేదా కాలానుగుణ వ్యాప్తిగా మారుతుందని చాలా మంది అంచనా వేస్తున్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని