Jagdeep Dhankhar: సోనియా వ్యాఖ్యలపై నా స్పందన సబబే.. లేదంటే..: జగదీప్‌ ధన్‌ఖడ్‌

న్యాయవ్యవస్థపై కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ చేసిన వ్యాఖ్యలపై తాను స్పందించకపోతే రాజ్యాంగబద్ధ విధుల నిర్వహణలో విఫలమై ఉండేవాడినని రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ చెప్పారు.

Updated : 24 Dec 2022 07:12 IST

లేదంటే విధినిర్వహణలో నేను విఫలమైనట్లే: ధన్‌ఖడ్‌  
ముందే ముగిసిన పార్లమెంటు శీతాకాల సమావేశాలు

దిల్లీ: న్యాయవ్యవస్థపై కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ చేసిన వ్యాఖ్యలపై తాను స్పందించకపోతే రాజ్యాంగబద్ధ విధుల నిర్వహణలో విఫలమై ఉండేవాడినని రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ చెప్పారు. సభాధ్యక్ష స్థానానికి ఉద్దేశాలు ఆపాదించడం తగదన్నారు. శుక్రవారం రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ- సభ వెలుపల సోనియా మాట్లాడిన అంశంపై ఛైర్మన్‌ స్పందించడం దురదృష్టకరమనీ, ఇలా ఎప్పుడూ జరగలేదని అభ్యంతరం వ్యక్తంచేశారు. ఈ వ్యాఖ్యల్ని రికార్డుల నుంచి తొలగించకపోతే ఇదో దుష్ట సంప్రదాయం అవుతుందన్నారు. ఎందరితోనో మాట్లాడి, ఎంతో కసరత్తు చేశాకే సోనియా వ్యాఖ్యలపై తాను స్పందించినట్లు ధన్‌ఖడ్‌ స్పష్టీకరించారు. ఉన్నతస్థాయిలో అంతకంటే నిగ్రహంగా మాట్లాడడం సాధ్యం కాదన్నారు. స్పందించకుండా తప్పించుకుని ఉంటే తనకు, సభకు సిగ్గుచేటు అయి ఉండేదని అన్నారు. న్యాయవ్యవస్థ చట్టబద్ధతను తగ్గించడమంటే ప్రజాస్వామ్యానికి మరణ శాసనమేనని చెప్పారు.

ముందే ముగియడం ఇది ఎనిమిదోసారి

పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఆరు రోజుల ముందుగా శుక్రవారమే ముగిసిపోయాయి. ఇలా జరగడం వరసగా ఇది ఎనిమిదోసారి. సమావేశాలు 29వ తేదీ వరకు కొనసాగాల్సి ఉన్నా.. క్రిస్మస్‌, నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో వీటిని కుదించాలని అన్ని పార్టీల ఫ్లోర్‌లీడర్ల నుంచి వచ్చిన సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సభాపతులు ప్రకటించారు. గత యాభై ఏళ్లలో పార్లమెంటు సమావేశమవుతున్న రోజుల సంఖ్య క్రమేపీ పడిపోతోందని ‘పీఆర్‌ఎస్‌ లెజిస్లేటివ్‌ రీసెర్చ్‌’ నివేదిక పేర్కొంది.

లోక్‌సభ ఉత్పాదకత 97%

సరిహద్దులో చైనా చొరబాట్లు, తవాంగ్‌ వద్ద పరిస్థితులపై చర్చించాలని శీతాకాల సమావేశాల్లో ఉభయ సభల్లోనూ విపక్ష సభ్యులు డిమాండ్‌ చేసి, వాయిదా తీర్మానాల కోసం పట్టుబట్టారు. లోక్‌సభలో స్పీకర్‌ ఓం బిర్లా మాట్లాడుతూ 13 పనిదినాల్లో దిగువ సభ 97% ఉత్పాదకత సాధించిందని, ఏడు బిల్లుల్ని ఆమోదించిందని చెప్పారు. రాజ్యసభ సమావేశాలు 64 గంటల 50 నిమిషాలసేపు జరగ్గా, 102% ఉత్పాదకత నమోదైందని ధన్‌ఖడ్‌ తెలిపారు.

ధన్‌ఖడ్‌కు జైరాం రమేశ్‌ లేఖ

రాజ్యసభలో కాంగ్రెస్‌ చీఫ్‌ విప్‌ జైరాం రమేశ్‌ శుక్రవారం ధన్‌ఖడ్‌కు లేఖ రాస్తూ సోనియాపై ఆయన వ్యాఖ్యల్ని ఖండించారు. చైనా సరిహద్దు వంటి సున్నితమైన సమస్యపై చర్చకు గతంలో యూపీయే ప్రభుత్వం కూడా నిరాకరించిందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌జోషి విలేకరులకు చెప్పారు. చైనా గురించి పార్లమెంటులో చర్చ జరిగితే మనదేశ వైఖరిపై వ్యతిరేక ప్రభావం పడడంతోపాటు పాకిస్థాన్‌తో మన సంబంధాలను దెబ్బతీస్తుందన్నారు. ఈ రెండూ మన దేశ ప్రయోజనాలకు మంచిది కాదని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని